వరంగల్: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని కడియం మండిపడ్డారు. దేశంలో ప్రజలకు ఉన్న స్వేచ్ఛ వాతావరణాన్ని లేకుండా చేసే కుట్ర మోదీ చేస్తున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. 
హనుమకొండలో కడియం శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 400 సీట్లు గెలవాలని దేశంలోని మీడియా వ్యవస్థను మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రసంగంలో హిందువు, ముస్లింలు వేరు, హిందువులు, క్రిష్టియన్లు వేరు అనే విధంగా మోదీ దిగజారి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మారుస్తాం, అంబేద్కర్ సిద్ధాంతాల్ని వాదాన్ని అనగదొక్కుతామనే విధంగా మాట్లాడుతున్నారని శ్రీహరి అన్నారు. 


గత పదేళ్లలో వారిపై దాడులు 
ఈ ఎన్నికలు దేశానికి పరీక్ష సమయమని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పది సంవత్సరాల పాలనలో దేశంలో దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మహిళపై దాడులు పెరిగాయని శ్రీహరి ఆరోపించారు. ఓటు ద్వారా బీజేపీ మతతత్వ వాదాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. దేశంలో ఏ వర్గానికి మేలు చేశారో సమగ్ర అభివృద్ధికి చేసిన కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయిసినవేనని ఆయన అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పది సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యగలు ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారో చెప్పాలన్నారు. దేశాన్ని అదానీకి, అంబానీకి తాకట్టు పెడుతున్నారని... పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ పొట్ట నింపారని కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణలో బిజెపికి ఓటు అడిగే హక్కులేదు 
తెలంగాణ ఏర్పాటుకు ప్రధాని మోదీ వ్యతిరేకి అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీ లేదన్నారు కడియం శ్రీహరి. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పెద్దగా సంబంధాలు ఉన్నాయని జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని కడియం శ్రీహరి అన్నారు.


కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం అభివృద్ధి జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతే కేసిఆర్ తేలికగా తీసుకున్నారని పిల్లర్లు కూలిన తర్వాత వాటర్ను ఎలా నింపుతారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కుర్చీలో కూర్చుని నీటిని నింపుతారా అని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.


హరీష్ రాజీనామా డ్రామానే..
హరీష్ రావు రాజీనామా ఓ డ్రామా అని ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ మాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన హరీష్ రావు.. ఇప్పుడు రైతు రుణమాఫీ కాకుండా అనేక అంశాలను చేర్చడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బ్రతకాలంటే బీజేపీకి ఓట్లు పడకుండా చూడాలని ప్రజలకు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బలైంది ఎవరు? కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ టాపింగ్ జరిగిందా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.