వరంగల్ లో బాలుడి అమ్మకం కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబానికి కన్న కొడుకును ఓ తండ్రి అమ్మడానికి ప్రయత్నించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే బాలుడ్ని రక్షించారు. బాలుడిని క్షేమంగా తల్లి చెంతకు పోలీసులు చేర్చారు. బాలుడి అమ్మకం ఘటనపై మట్టేవాడ సీఐ వెంకటేశ్వర్లు స్పందించారు. ఈ నెల 28న ఉదయం బాబు మేనమామ మహమ్మద్ అక్బర్ ఫిర్యాదు చేయడంతో బాలుడ్ని కాపాడగలిగామని తెలిపారు.


‘‘చిన్న కొడుకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా పెద్ధ కొడుకు అయాన్ ను అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తానని తండ్రి మాసూద్ తీసుకెళ్లాడు. అక్క వాళ్ళ ఇంటికి బాబు అయాన్ ను తండ్రి మసూద్ తీసుకెళ్లలేదు. రెండు రోజులుగా బాబు అయాన్ కనపడకపోవడంతో తండ్రి మసూద్ ని తల్లిని, మేనమామ మహమ్మద్ అక్బర్ అడిగారు. బాబుని పెంచడంలో ఇబ్బంది అవుతుందని, వేరే వాళ్ళు పెంచుకుంటాం ఆంటే వాళ్లకు ఇచ్చేశానని తండ్రి చెప్పాడు. ఎవరికైనా అమ్మి ఉంటాడనే అనుమానంతో బాలుడి మేనమామ మాకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పెంచుకోవడం కోసమే బాబును తీసుకున్నట్లుగా మా దర్యాప్తులో తెలిసింది. ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.