ఏ పార్టీలో చేరాలనే దానిపై బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలకు క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు  నుంచి ఎలాంటి స్పష్టత లేకపోయినా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దీనిపై ఓ క్లూ ఇచ్చేశారు. వాళ్లను బీజేపీలోకి తీసుకురావడం అంత ఈజీ కాదని చెప్పడం వెనుక వేరే అర్థం ఉందనేది స్పష్టమవుతోంది. 


పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరేందుకు  డిసైడ్ అయ్యారనే ప్రచారం ఎప్పటి నుంచో జోరుగా సాగుతోంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేసిన ప్రకటనతో దీనికి మరింత ఊపు వచ్చింది. 


పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేయి అందుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైనట్టు కూడా ప్రచారం నడుస్తోంది. జూన్‌ 8న కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వారిద్దర్ని కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ఎప్పటి నుంచో అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. 


జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ తమ అనుచురుల, సన్నిహితులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. చివరకు కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని జూపల్లి సన్నిహితులు బహిరంగంగానే చెబుతున్నారు. పొంగులేటి శిబిరం నుంచి మాత్రం ఇంకా సంకేతాలు రావడం లేదు.  


పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును తమ పార్టీల్లో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీ పడ్డారు. ఇరు పార్టీల అగ్రనాయకులతో వీళ్లిద్దరు మాట్లాడారు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు బలంగా ఉన్నట్టు కనిపించిన బీజేపీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అటుగా చూసేందుకు కూడా లీడర్లు ఆలోచించడం లేదు. వీళ్లిద్దరు కూడా అదే బాటలో ఉన్నారని బీజేపీ నేతలతో చర్చలు విఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి. 


తాజాగా ఈటల రాజేందర్ కూడా వారితో చర్చించారు. అయితే వాళ్లను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తే తన మైండ్‌ సెట్‌ మార్చేలా వాళ్లే కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వాళ్లను బీజేపీలోకి తీసుకురావడం అంత ఈజీ కాదన్నారు. దీంతో వాళ్లిద్దరు వేరే కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. 


పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌యింది.


మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు వారు బీజేపీలో చేరరని అంటున్నారు. అంతే కాదు ఇతర నేతలందర్నీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ను కూడా పిలుస్తున్నారు. ఎలా చూసినా  చేరికల కమిటీ చైర్మన్ ఈటల వారిద్దర్నీ  బీజేపీలోకి ఆకర్షించడంలోకి విఫలమయ్యారు. మరి ఈటల చెప్పినట్లుగా వారి రివర్స్ కౌన్సెలింగ్ వారిపై ఏమైనా ప్రభావం చూపిందో లేదో త్వరలోనే తేలనుంది.