Warangal News: రైల్వే లైన్ కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నవాళ్లం చూస్తున్నాం..ఒకవేళ తమ ప్రాంతం నుంచి రైల్వేలైన్ వెళ్లినా అక్కడ రైళ్లకు హాల్టు లేదని పట్టాలపై ధర్నాలు చేసిన వాళ్లను చూశాం.  ఫలానా ఎక్స్ ప్రెస్ తమ స్టేషన్ లో ఆపాలంటూ పోరాటాలు చేసిన వాళ్లనూ చూశాం. ఎందుకంటే ఒక ప్రాంతానికి రైల్వేలైన్ రావడం, స్టేషన్ ఏర్పాటు చేయం అక్కడ రైళ్లు ఆగేలా చేయడం ఎంత కష్టమైన పనో పైన చెప్పిన ఉదాహరణలు చెప్పకనే చెబుతున్నాయి. కానీ ఇవేమీ చేయకుండానే తమకు కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకూడదని  సమిష్టిగా పోరాటం చేస్తున్నారు. నెక్కొండ పట్టణ రైల్వే టిక్కెట్స్ ఫోరం సభ్యులు..ఆ కథేంటో ఒకసారి చూద్దాం.


రైలు ఎక్కకున్నా టిక్కెట్ కొనాల్సిందే 
వరంగల్(Warangal) జిల్లా నెక్కొండ(Nekkonda) రైల్వేస్టేషన్ లో ప్రతిరోజూ ఠంచన్ గా ఓ 60 టిక్కెట్లు తెగుతాయి. జనం రైలు ఎక్కినా, ఎక్కకున్నా....రైలు ఆగినా, ఆగకున్నా ఈ 60 టిక్కెట్లు ప్రతిరోజూ  కొనుగోలు చేస్తూనే ఉంటారు. కేవలం టిక్కెట్లు(Tickets) కొనుగోలు చేయడం స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోవడం ఇదే వీరి పని. ఎక్కడికీ ప్రయాణం చేయని కాడికి ఆ టిక్కెట్ల కొనుగోలు ఎందుకంటారా..? తమ ఊరిలో ఓ రైలు హాల్టింగ్ రద్దు కాకూడదని. దీని కోసం వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి మరీ విరాళాలు ఇస్తున్నారు. . నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్ నెక్కొండ మాత్రమే. ఈ ప్రాంత ప్రజలు  తిరుపతి(Tirupathi), హైదరాబాద్‌(HYD), ఢిల్లీ(Delhi), శిరిడీ(Shiride) వెళ్లాలంటే ఉన్న ఏకైక రైలు స్టేషన్ ఇదే. 


చిన్న స్టేషన్ కావడం, పెద్దగా రద్దీ లేకపోవడంతో ఇప్పటికే చాలా రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ ఎత్తివేశారు. ఆదాయం తగ్గుతోందన్న  సాకుతో  రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్‌లో హాల్టింగ్‌ను రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్‌(Secundrabad) నుంచి గుంటూరు(Guntur)కు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హాల్టింగ్‌ కల్పించారు. అయితే మూడు నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్‌ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైలును కోల్పోకూడదని పట్టణవాసులు మొత్తం సంఘటితమయ్యారు.  నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.25 వేలు సేకరించారు. ఈ సొమ్ముతో రోజూ నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు రైలు టికెట్లు కొంటున్నారు. స్టేషన్‌కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్‌ కోసం కృషి చేస్తామని వారు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ స్టేషన్  తరలిపోకుండా కాపాడుకుంటామని నెక్కొండ వాసులు అంటున్నారు. ఒక్కసారి స్టేషన్ చేజారిపోయిన తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసినా...ధర్నాలు చేసినా  తిరిగి రాబట్టలేమని అందుకే ఇప్పుడే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తిరుపతితోపాటు సికింద్రాబాద్, ఖమ్మం వెళ్లాలంటే రైల్వేమార్గం ఎంతో సులభంగా ఉంటుంది..పైగా ఇది అత్యంత రద్దీ కలిగిన లైన్ కావడంతో  భవిష్యత్ లోనూ మరిన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించుకోగలమని వారు దీమా వ్యక్తం చేశారు. నెక్కింటి పట్టణ ప్రజల కృషిని సమీప గ్రామ ప్రజలు మెచ్చుకుంటున్నారు. రైల్వే స్టేషన్ చేజారిపోకుండా తమవంతు సాయం అందిస్తామని ముందుకొస్తున్నారు.