Bogatha WaterFalls in Telangana | వాజేడు: తెలంగాణలో పర్యాటకులకు అధికారులు శుభవార్త చెప్పారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. భారీ వర్షాలు, వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని రోజుల కిందట బోగత వాటర్ పాల్స్ సందర్శనను నిలిపివేశారు. వాటర్ ఫాల్స్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో గల్లంతయి, కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వారం రోజులనుంచి సందర్శకులను వాటర్ ఫాల్స్ చూసేందుకు అనుమతించలేదు. 


ఎగువన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు ములుగు జిల్లా వాజేడు మండలం బోగత వాటర్ ఫాల్స్ కు చేరుతుంది. తెలంగాణలో గత వారం కొన్ని రోజులు కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నయాగరా బోగత వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిని చూసేందుకు ములుగు జిల్లా వాసులతో పాటు చుట్టు పక్కల జిల్లా నుంచి సైతం సందర్శకులు బోగత వాటర్ ఫాల్స్‌కు క్యూ కట్టారు. కానీ వరద ప్రవాహం అధికం కావడంతో వారం రోజుల కిందట సందర్శకులను జలపాతం వద్దకు అనుమతించలేదు. తాజాగా వానలు లేకపోవడం, నీటి ప్రవాహం ఉధృతి తగ్గడంతో బోగత వాటర్ ఫాల్స్ చూసేందుకు సందర్శకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ప్రకటన చేశారు. 



వాజేడు అటవీశాఖ రేంజ్ అధికారి బోనోత్ చంద్రమౌళి మాట్లాడుతూ.. వర్షాలు ఆగిపోవడం, వరద ఉధృతి సైతం తగ్గడంతో సందర్శకులను బోగత జలపాతం వద్దకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. కానీ నీళ్లలో లోపలికి వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు దిగడం, వీడియోలు దిగడం లాంటివి చేయవద్దన్నారు. నీళ్లల్లో దిగి స్నానాలు చేయడం లాంటివి సైతం చేయకూడదని సూచించారు. వరద ప్రవాహం పెరిగితే బోగత జలపాతం వద్దకు మళ్లీ సందర్శకులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేస్తామన్నారు.


Also Read: Revanth Reddy: కల్వకుర్తికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు, తాను చదువుకున్న స్కూల్‌కు సైతం రూ.5 కోట్లు ప్రకటన