Minister Niranjan Reddy: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. తెలంగాణలో గెలుస్తాననే నమ్మకం ఉంటే.. ధైర్యంగా వచ్చి మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోమని సూచించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వనపర్తికి వెళ్లిన షర్మిల... అక్కడే మంత్రి నిరంజన్ రెడ్డిపై కామెంట్లు చేశారు. అయితే శనివారం రోజు గోపాలపేటలో ఆసరా కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడే షర్మిల చేసిన కామెంట్లపై ఆమె స్పందించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించవద్దని చెప్పిన వారు.. నేడు తెలంగాణ ప్రజల గురించి పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే తనను హేళన చేశారని షర్మిల మండిపడ్డారు. 


పాదయాత్ర పేరుతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి వ్యవసాయ రంగంతో పాటుగా అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా మార్చారని అన్నారు. అది సహించలేకే ఇతర పార్టీల నేతలు ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ వెంట 22 ఏళ్లు జెండాలు పట్టుకని తిరిగానని చెప్పారు. వనపర్తిని జిల్లాగా చేసి జేఎన్టీయూ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలను మంజూరు చేయించానని.. జిల్లా ప్రజల సంక్షేమం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధం అని తెలిపారు. 


మంత్రి నిరంజన్ పై దారుణమైన వ్యాఖ్యలు.. 
తెలంగాణలో వైఎస్సార్ పేరుతోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం తీసుకురావాలన్న లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఘాటుగా విరుచుకుపడుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిని వీధికుక్కతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు.  సీఎం కేసీఆర్‌పైనా ఆయన ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. పాదయాత్రను పూర్తి చేసి రాజన్న బిడ్డంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేలా ప్రజల్ని ఒప్పిస్తానని ఆమె నమ్మకంతో ఉన్నారు. 


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండు వేల కిలో మీటర్లకు చేరింది. ఈ సందర్భంగా కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు షర్మిల. పైలాన్ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు.  మహానేత వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్‌ విజయమ్మ. ‘‘వైఎస్సార్‌ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్‌. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్‌టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్‌ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు.