Revanth Reddy on TRS: టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆరెస్‌కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని ఆరోపించారు. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారని... నాలుగేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చుడో.. శాసన సభ్యుడు సచ్చుడో తేలాలంటూ కామెంట్లు చేశారు.


గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ ను ఉతికి ఆరేస్తాం..


అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి... టీఆరెస్ తీరును ఉతికి ఆరేస్తాం అన్నారు. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని తెలిపారు. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రేస్ ను దెబ్బ తీసేందుకే టీఆరెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయన్నారు. 


టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు..


ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందరికీ నోటీసులు జారీ చేసి ఢిల్లీ పిలిపించి ప్రశ్నిస్తే కవితను మాత్రం సీబీఐ అధికారులు అనుమతి కోరుతున్నారని.. ఇక్కడే టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆరెస్, బీజేపీ చాలా కాలంగా  కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా భారతీయ జనతాపార్టీ వద్ద ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను గతంలో ఫిర్యాదు చేసిన కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలన్నారు. గతంలో ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 


రేపటి లోపు స్పందించకపోతే తీర్పు చెల్లదు..


కేసీఆర్ అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు తాను  ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని... టీఆరెస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకమని విమర్శించారు.  అమరవీరుల స్థూపం కాంట్రాక్టు ఆంధ్రా వాళ్లకు అప్పగించారని.. ఎనిమిదేళ్లు దాటినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు .