Tiger in Mahabubnagar: ఇటీవలే నాలుగు పులి పిల్లలకు జన్మనిచ్చిన ఓ పులి ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు ఆడపులి పిలల్లకు జన్మనిచ్చింది. అయితే 6వ తేదీన పిల్లలను వదిలి కృష్ణా నది దాటి తెలంగాణలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న నల్లమల అడవులకు చేరిందని స్థానిక అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సులాలకుంట అటవీ ప్రాంతంలో.. అటవీ శాఖ అధికారులు అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఓ ఆడ పులి ట్రాప్ అయినట్లు రెండ్రోజుల క్రితం గుర్తించారు. అయితే ఆంధ్రా నుంచి వచ్చిన పులేనా లేక మరో పులా అన్న విషయమై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ పులిని గుర్తించే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు. 


ఈనెల 21వ తేదీన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్జ్ డైరెక్టర్ క్షితజ దంపతులు సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీలోని ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు అక్కడకు చేరుకొని ఆమెను కలిశారు. అక్కడి నుంచి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి నల్లమలకు చేరినట్లు సమాచారం అందించారు. దీంతో ఆమె కొల్లాపూర్ రేంజ్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండ్రోజుల క్రితం సులాలుకుంట ప్రాంతంలో ఆడ పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యారు. ఈ విషయంపై ఇరు ప్రాంతాల అటవీ శాఖ అధికారులు ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. 


ఇటీవలే జూకు చేరిన పులి పిల్లలు


ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో తల్లి నుండి వేరు అయిన నాలుగు పులి పిల్లలు లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దపులి సంచారంతో భయపడ్డ గ్రామస్థులు.. పులి పిల్లలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి నాలుగు పులి పిల్లలను రక్షించారు. పులి పిల్లల కోసం పులి వస్తుందేమో అని ఫారెస్టు అధికారులు అనేక విధాలుగా ప్రయత్నం చేసినా పెద్దపులి‌ జాడ ఏమాత్రం కనిపించలేదు. అయితే ఈ పులి కూనల సంరక్షణార్థం తిరుపతి ఎస్వీ జూ పార్కుకు అప్పగించారు.


జూపార్కులో ఏసీఎఫ్ నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలో 50 రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అక్కడి జూ అధికారులు మహమ్మద్ సయ్యద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్, ఎస్కార్ట్ సిబ్బందితో కలిసి అప్పగించారని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో వాటి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించినట్లు వివరించారు. తల్లి నుండి విడిపోయిన తర్వాత ఫీడింగ్ లేక పోవడంతో కొంత బలహీనంగా ఉన్నాయన్నారు. వైద్యుల పర్యవేక్షణలో బలవర్ధకమైన ఫీడింగ్ అందజేసి, మంచి వాతావరణంలో పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటే, ఏసీలో వాటిని ఉంచి రక్షిస్తామని అన్నారు. వెటర్నరీ వైద్యులతో తరచుగా తనిఖీ చేయిస్తుంటామన్నారు.