Telangana RTC Strike:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజు తీవ్ర విషాదం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరైన వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి మరణించడం సమ్మె తీవ్రత పెంచింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శంకర్ గౌడ్ సమ్మెలో మానసిక ఒత్తిడికి గురయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకర్‌ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా, దారి మధ్యలోనే కర్మాన్‌ఘాట్ వద్ద ఆయన కన్నుమూశారు. శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో ఉంచినట్టు సమాచారం.
మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తొందరపాటు నిర్ణయాలు వద్దని వారించిన సీఎం
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు, మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవద్దని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని హితవుపలికారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉందని ఈ విషయంలో ఇప్పటికే దృష్టి సారించామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని, కార్మికులు సంయమనం పాటించాలని మంత్రి శ్రీధర్ బాబు కూడా విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
ఆర్టీసీ సమ్మెకు బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్ పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు ఎంతో సహకరిస్తున్నా, ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఆర్టీసీతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో అందరూ చూశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్పు చేయద్దని హితవు పలికారు.
వెనక్కి తగ్గని ఆర్టీసీ కార్మికులు
ప్రభుత్వంతో చర్చల ప్రకటన వచ్చినప్పటికీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కార్మికుడు శంకర్ గౌడ్ మృతితో పోరాటం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చాయి. జేఏసీ ఛైర్మన్ వెంకన్న, వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి రాబోయే రోజుల కోసం కీలక కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్ 24 అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శన చేస్తారు. ఏప్రిల్ 25న డిపోల వద్ద వంటా వార్పు కార్యక్రమం, ఏప్రిల్ 26న జిల్లాల్లో ఆర్టీసీ కార్మికుల కవాతు ఉంటుంది. ఏప్రిల్ 27న ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల అందేత, మహిళా ఉద్యోగుల నిరసన చేస్తారు. ఏప్రిల్ 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారు.
