వరంగల్ : తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, ఆయన తెలంగాణ ప్రదాత, భావి భారత విధాత అని.. సీఎం పుట్టిన రోజును ఇంటింటా జరుపుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆయన దేశానికే మార్గదర్శి, దిక్సూచి, ఆయన మార్గ నిర్దేశనం దేశానికి అవసరం అన్నారు. యావత్తు దేశం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోందని అన్నారు. 


వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అధ్వర్యంలో వరంగల్ ఓ సిటీ గ్రౌండ్ లో 3 రోజులపాటు సీఎం కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల ప్రదర్శనను, కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం... ఫోటో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు రైతు, దళిత బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేసీఆర్ కిట్లు, టి హబ్, వి హబ్, ఐ శాట్, పరిశ్రమలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అనేక పథకాల తెలిపే విధంగా నమూనాలను ప్రదర్శించారు. 
  
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ఉత్సవం అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా, ఇంటింటా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణ ను తెర్లు కాకుండా కాపాడుతూ, దేశంలోనే అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపారని చెప్పారు. ఇవ్వాళ మన రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారింది. అన్నపూర్ణగా నిలిచింది. అందుకే దేశం యావత్తు కేసీఆర్ వైపు చూస్తున్నది. ఆయన భావి భారత విధాత గా నిలిచారని చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మన తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడా లేవని ఆయన చెప్పారు. ఆయా పథకాలను మంత్రి ఉదహరించారు. వివరించారు. 
 
రేవంత్, బండి సంజయ్ లపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న రేవంత్, బండి సంజయ్ లపై మంత్రి తీవ్రంగా మండి పడ్డారు. పిట్టల రాముడిలా పెగ్గెలు కొడుతున్నారని, వాళ్ళతో ఊదు కాలదు... పీరు లేవదు. వాళ్ళతో అయ్యేది లేదు పోయ్యేది లేదు అని మంత్రి అన్నారు. పిచ్చి పిచ్చి గా మాట్లాడతారు. కనీస మర్యాదలు పెద్దా, చిన్నా తేడా తెలవని మూర్ఖులని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్. బండి సంజయ్ ఓ తొండి మనిషి. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇలాంటి వాళ్ళతో ఏమీ కాదు. వాళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే నని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమాల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, వరంగల్ zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.