Errabelli Dayakar Rao: ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుండి ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదటి పోస్టు కార్డును కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రెండో పోస్టు కార్డును కేంద్ర మంత్రికి పంపించారు. పోస్టు కార్డుపై ఏం రాసి ఉందంటే..
గౌరవనీయులైన కేంద్ర జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాడనికి రూ. 30 వేల కోట్లు నిధులు తగ్గించడంతో ఉపాధి కూలీ పనిదినాలు తగ్గాయి. వ్యవసాయ కూలీకి రోజుకు రూ. 257 ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ ఏ ఒక్క కూలీకి రూ.100 లకు మించడం లేదు. పని ప్రదేశాల్లో కనీస మౌళిక సదుపాయాలైన (టెంటు, మంచి నీరు, గడ్డపారలు, పారలు, తట్టలు) అందించడం లేదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పని చేసిన కూలీకి రూ.480 ఇవ్వాలని ఉన్నప్పటికీ ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ అందటం లేదు. ఆన్ లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ లో అప్లోడ్ చేయాలనే నిబంధన ఉండటం వల్ల కూలీలు పనులకు దూరం అవుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. సన్న చిన్న కారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారు. కాబట్టి వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాలన్ని అనుసంధానం చేయటం వల్ల రైతులకు కూలి గిట్టుబాటు అవుతుంది. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పనిదినాలు కల్పించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏపీఓల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ పోస్టు కార్డులో రాశారు.
అంతకుముందు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో మొత్తం 5కోట్ల 62 లక్షల రూపాయల విలువైన పనులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు చేశారు. 4 కోట్ల 41 లక్షల విలువైన వెంకటాపురం నుండి మహ్మదాపురం మీదుగా రాజేశ్వర రావు పల్లె వరకు 6.30 కి.మీ. పొడవైన బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ.70 లక్షలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఆయా పథకాల వారీగా అందిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను మంత్రి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందని అన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రద్దు చేసిన తెలిపారు. అర్థం లేని ఆంక్షలతో వేధిస్తున్నారని ఆరోపించారు.