ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటన వేళ బీఆర్‌ఎస్ భగ్గుమంటోంది. సింగరేణి ప్రైవేటీకర యత్నాలు ఆపు చేయాలన్న నినాదంతో సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టింది. ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ గర్జిస్తున్నారు.
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. దీనికి నిరసనగానే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా మహాధర్నాకు పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో పెద్ద ఎత్తున కార్మిలు, బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
భూపాలపల్లిలో నిర్వహించనున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద చేపట్టిన ఆందోళనలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు హాజరయ్యారు.
బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పరివార్ వెల్‌కమ్స్ యూ మోదీ జీ’ అంటూ సెటైరిక్‌గా కొందరు ఫ్లెక్సీలు పెట్టారు. బీజేపీ లీడర్ల వారసులతో ఈ ఫ్లెక్సీలు వేశారు. అమిత్ షా, మాధవరావ్ సింథియా, రాజ్‌నాథ్ సింగ్, యడ్యూరప్ప, నారాయణ్ రాణే, రమణ్ సింగ్, వసుంధర రాజే, ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండేతోపాటు వారి వారసులఫోటోలు ముద్రించారు. ఇందులో అదానీ, అబానీ వారసుల ఫొటోలు కూడా పెట్టారు.