Development of Warangal District: వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా (హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి )పరిధిలోని 12 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ లు పాల్గొని నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, కుడా, జి డబ్ల్యు ఎం సి, నేషనల్ హైవేస్, ఐటీడీఏ, హౌసింగ్, పోలీస్, ఫారెస్ట్, దేవాదాయ శాఖ ల పనితీరు, చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో చర్చించారు. 


తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు 
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చేది వేసవికాలం కాబట్టి ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఏ స్టేజిలో ఉన్న పూర్తిచేసే విధంగా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. వచ్చే నెలలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఈనెల 30వ తేదీన మేడారం లో మంత్రుల బృందం పర్యటించి ఏర్పాట్లను  పరిశీలించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు అధికారుల సమన్వయంతో పనిచేసి  జాతరపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు నడుచుకోవాలని సూచించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. 


అధికారులు ప్రజాపాలన కార్యక్రమంలో అద్భుత పనితీరును కనబరిచారని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అద్భుతంగా పనిచేసినందుకు అధికారులకు ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు  ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా అట్టడుగు స్థాయిలోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. పంటల సాగుకు  సాగునీరు అందించకపోతే ఇబ్బందులు వస్తాయని కాబట్టి ఆ శాఖ అధికారులు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏ పనికైనా అడ్డగోలుగా అంచనా వ్యయం వేయకుండా అధికారులు చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, గురుకులాలను తరచుగా జిల్లా కలెక్టర్లు,అధికారులు  తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. 
ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం - కొండా సురేఖ
రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధినే తమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. పాలకులం కాదని ప్రజలకు సేవకులం అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు కావాల్సిన పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కోసం డీఆర్సి, డీఆర్డీవో సమావేశాలు జరిగేవని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించలేదని, దీంతో అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడి పోయిందన్నారు. ప్రజలకు నష్టం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలకు అన్నీ సౌకర్యాలు అందాలంటే ఇలాంటి సమీక్ష సమావేశాలు జరగాలన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్  చేయాలని, ఇందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. త్వరలోనే ఎయిర్పోర్టు భూములను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రావాలని కొండ సురేఖ కోరారు. 


బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు సమీక్షా సమావేశం 
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఉన్న సమస్యల పరిష్కారం కోసం నీ సమీక్ష సమావేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్లో కావాల్సిన అంశాలపై ఈ సమావేశంతో అవగాహన కలుగుతుందన్నారు. సమన్వయంతో అధికారులు పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు సమీక్షా సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేయాల్సినవి ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలన్నారు. 


మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను మరిన్ని కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. మేడారం జాతరకు ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. అందుకు మేడారానికి రావాలని మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సురేఖలను ఆహ్వానించారు. మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు మంత్రులు సహకరించాలని కోరారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యల్లో వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని అన్నారు. 25, 28వ తేదీల్లో మేడారం జాతరను సందర్శించాలని మంత్రి సీతక్క కోరారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఉమ్మడి కరీంనగర్ పరిధిలో ఉన్న మూడు మండలాలు హనుమకొండ జిల్లా పరిధిలోనికి వచ్చాయని అన్నారు. వాటికి అభివృద్ధి కి అధికారులు ప్రణాళికతో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.