Pradhan Mantri Rashtriya Bal Puraskar Award: వరంగల్: కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను జనవరి 19వ తేదీన ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 19 మంది చిన్నారులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో జనవరి 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కూచిపూడి నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ (Pendyala Lakshmi Priya) ఎంపికైంది.
తెలంగాణలోని వరంగల్ కు చెందిన నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ కళ, సంస్కృతి కేటగిరీలో 2024 బాల పురస్కారానికి ఎంపికైంది. 14 ఏళ్ల లక్ష్మీప్రియ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. 2023లో లక్ష్మీప్రియ శాస్త్రీయ నృత్యం కేటగిరీలో కళా ఉత్సవ్ జాతీయ అవార్డును గెలుచుకుంది. 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూచిపూడి, మోహిని నాట్యంలో అత్యుత్తమ ప్రదర్శనకు ‘లాస్యప్రియ‘ బిరుదును అందుకుంది. 2024 ఏడాదికి గాను రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 19వ ప్రదానం చేయనుంది.
కేటగిరీల వారీగా అవార్డులు ఎవరికిచ్చారంటే..
మొత్తం 19 మంది చిన్నారులకు రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. అత్యధికంగా కళ, సంస్కృతి నుంచి 7 మంది ఎంపికయ్యారు. క్రీడలు (5), సామాజిక సేవ (4), ఇన్నోవేషన్ (1), సైన్స్ టెక్నాలజీ (1), శౌర్యం (1) ఇలా ఆరు కేటగిరీల్లో అవార్డులకు చిన్నారులకు ఎంపిక చేశారు. అవార్డు గ్రహీతలైన చిన్నారుల్లో 10 మంది అమ్మాయిలు ఉండగా, అబ్బాయిలు 9 మంది ఉన్నారు.
బాల పురస్కారాలకు ఎంపికైన చిన్నారులు జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి ఆయనతో ముచ్చటించనున్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.