Minister Errabelli: దేశవ్యాప్తంగా ఉన్న కూలీలకు ఏదో సాయం చేస్తామంటూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేరని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మోదీ సర్కారు పెద్దగా పట్టించుకోవట్లేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తోందని అన్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. కూలీల శ్రేయస్సు కోరి, ఉపాధి హామీ కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున ఉపాధి హామీ కూలీలకు.. స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, ఆయా వస్తువులను తీసుకెళ్లే విధంగా ఓ మంచి బ్యాగుని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాయపర్తి మండలం ఘటికల్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలు పని చేస్తుండగా.. మంత్రి ఎర్రబెల్లి వారిని కలిశారు. ఆ కూలీలను చూసి ఆగి కారు దిగి వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడే వారితో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వారితో పారపట్టి మట్టి తవ్వారు. అలాగే కొద్దిసేపు గడిపి, వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల్లో పనులు ఎలా జరుగుతున్నాయో కనుక్కున్నారు. అలాగే వారి అవసరాలు అడిగి తెలుసుకున్న మంత్రి.. ఆయా పనిముట్లు, వస్తువులను పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గతంలో ఉపాధి హామీ కింద మట్టి తవ్వకాల పనులు మాత్రమే చేపట్టేవారని, ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేసి ఆయా పనులను ఉపయోగంలోకి తెచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వారికి వివరించారు.
రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్
ఇటీవలే రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినట్టుగా చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదంటూ మంత్రి ఎర్రబెల్లి వివరించారు. రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్ని వసతులు కల్పించిన సీఎం కేసీఆర్.. రుణమాఫీ, సమృద్ధిగా నీరు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్, ఎదురు పెట్టుబడి రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో వ్యవసాయం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో రైతులే చెప్పాలని అన్నారు. రైతుల భూములకు భద్రత కల్పిస్తూ.. ధరణి పోర్టల్ తెచ్చారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
రైతు వేదికలు, రైతు కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించి, పంటల నష్టాలకు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తూ, రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నది సీఎం కేసీఆర్ అని అన్నారు. వీటివల్లే రాష్ట్రంలో పంట దిగుబడులు పెరిగాయని చెప్పారు. దేశానికే కాదు, దేశ విదేశాలకు కూడా తెలంగాణ ప్రజలు పండించిన పంటలు వెళ్తున్నాయన్నారు. రైతును రాజు చేయడానికి ఇంతగా కష్టపడుతున్న సీఎం కేసీఆర్ దయవల్లే నేడు వ్యవసాయం పండుగగా మారిందన్నారు.