Medaram Mini Jathara: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరు వచ్చింది. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజుస, పడిగిద్ద రాజు పూజారుల మినీ జాతర తేదీలను నిర్వహించేందుకు సమావేశం అయ్యారు. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1న తేదీ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతరను నిర్వహిస్తారు. 


ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర..


అయితే ఫిబ్రవరి 1వ తేదీన  మండ మెలిగే పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో తేదీన సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేయడం, ఫిబ్రవరి మూడో తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని పూజారులు చెప్పారు. అలాగే మేడారం మహా జాతర జరిగే సమయంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను గద్దెలపైకి తీసుకు వస్తారు. అయితే మినీ మేడారం జాతర సమయంలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. అయితే గద్దెల వద్దే పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కు పూజారులు ఆహ్వాన పత్రికను కూడా అందజేశారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వ నిధులు అందజేయాలని కోరుతున్నారు. 


తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా..


ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలో మీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వన దేవతలుగా ఈ సమ్మక్క, సారలమ్మలు పూజలు అందుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. కేవలం రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 


ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996 లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అయితే రెండేళ్లకు ఒకసారి మేడారం జాతరను నిర్వహిస్తుండగా... సంవత్సరానికి ఒకసారి మేడారం మినీ జాతరను నిర్వహిస్తారు. అయితే 2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మల జాతర జరిగింది. 16 ఫిబ్రవరి 2022 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చుట, 17 ఫిబ్రవరి 2022 గురువారం రోజున చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వచ్చుట, 18 ఫిబ్రవరి 2022 శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుట, 19 ఫిబ్రవరి 2022 శనివారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం జరిగింది.