మేడారం మహా జాతర విజయవంతమైంది. దాదాపు కోటి 50 లక్షల మంది వనదేవతలను సందర్శించారు. తమ ఇష్ట దైవాలను తనివితీరా పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఏర్పాట్లలో, నిర్వహణలో నిమగ్నమై విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, పూజారులు, ఆదివాసీ సంఘాలు, భక్తులు సహా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రభుత్వం కృతజ్ఞత చెప్పింది. 


ఎప్పుడూ లేనట్టు జాతర కోసం 75 కోట్లు కేటాయించినట్టు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా మరో 10 కోట్లు, మొత్తం 85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. చాలా వరకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టారు. 


కరోనా కారణంగా జాతర ఉంటుందో లేదో అన్న అనుమానాలతో మూడు నెలల ముందు నుంచే భక్తులు రాకపోకలు ప్రారంభిచారు.  జాతర ప్రారంభమయ్యే టైంకి 60 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ రాత్రి ముగిసే నాటికి కోటి 50 లక్షలకు భక్తుల సంఖ్య చేరుతుంది. పార్కింగ్, సీసీ కెమెరాలు, చెక్కింగ్ పాయింట్ల వద్ద జరిగిన లెక్కింపు ఆధారంగా ఈ వివరాలను ప్రభుత్వం అందించింది. 


జాతర ముగిసిన తరువాత కూడా లక్షల మంది వరకు భక్తులు దర్శించుకోనున్నారు. అందుకే వాళ్లకు కూడా ఎటుంవంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు తెలిపారు. ప్రయాణ సదుపాయలు, రోడ్డు ఇతర మౌలిక వసతులు పెరగడంతో భక్తులు రాకపోకలు చాలా సులభతరమైందన్నారు. 


ఈసారి ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, భక్తులు ఎక్కువగా ఆగిపోలేదని ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. అమ్మ వార్ల మహిమకు, భక్తుల నమ్మకంతో కరోనా విజృంభణ తగ్గి అంతా సజావుగా సాగిందని మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
 
జాతర కోసం 8జోన్లలో 12 వందల మంది అధికారులు, 3వందల మంది మెడికల్ సిబ్బంది, వైద్య శిబిరాలు, 9 వందల మంది పారామెడికల్ సిబ్బంది, 10 వేల 3వందల మంది పోలీసు అధికారులు, 4వేల మంది పారిశుద్ధ్యకార్మికులతో పాటు అధనంగా మరో 1వేయి మంది అధికారులు పని చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ లు అందక సాంకేతిక సమస్యలు తలెత్తకుండా 30 సెల్ ఫోన్ టవర్లు, 3వందల శాశ్వత, 6400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.


వివిధ ప్రాంతాల నుంచి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కొరకు 3545 ఆర్టీసి బస్సులు నడిచాయి. తాగునీటి కోసం 500 బోర్లు, 4ఓ.హెచ్.ఆర్.ఎస్ ట్యాంకులు, స్నానాల కోసం 354 ఘట్టాలు ఏర్పాటు చేశారు. 


ఈ అనుభవాలతో, వచ్చే జాతరను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. సీఎం ఆదేశాల మేరకు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేసినట్టు పేర్కొన్నారు మంత్రులు. ఇంకా భూ సేకరణ చేపట్టి శాశ్వత నిర్మాణాలు చేపడితే, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండవని మంత్రులు అన్నారు.
జాతరలో ఎలాంటి ఇబ్బందుల లేకుండా గతంలో ఎన్నడు లేనివిధంగా చాలా సజావుగా జరగిందన్నారు మంత్రులు.