Sammakka Saralammala Gaddelu | వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్దరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించి గద్దెల నిర్మాణానికి సిద్ధమైంది. పనుల్లో భాగంగా అమ్మవార్ల గద్దెల చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు.
రూ.236 కోట్లతో పునరుద్ధరణ పనులు..తెలంగాణ ప్రభుత్వం గద్దెల పునర్నిర్మాణం కోసం 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సెప్టెంబర్ 23 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో అధికారులు, మేడారం పూజారులు, ఆదివాసీ గిరిజన సంఘాలతో సమావేశమయ్యారు. అన్ని వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా గద్దెల పునరుద్దరణకు అడ్డంకులు తొలగడంతో నేడు పనులకు శ్రీకారం చుట్టారు. పనుల కోసం ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 150 కోట్ల రూపాయలను విడుదల చేయడంతో పనులు స్పీడ్ గా కొనసాగనున్నాయి.
100 రోజుల్లో పునరుద్ధరణ పనులు 2026 జనవరి 28 వ తేదీన నుండి ప్రారంభం కానున్న మహజాతర నాటికి పనులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం సిద్ధం చేసింది. 100 రోజుల్లో పనుల పూర్తి చేయనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది. గద్దెల ప్రాంగణం చుట్టూ 8 అర్చీలు, భక్తులు అమ్మవార్లకు దర్శించుకునే సమయంలోని ఇబ్బందులు పడకుండా ఆధునిక క్యూలైన్లు, శాశ్వత నిర్మాణాలు, మౌళిక వసతులు పూర్తి చేయనున్నారు.
మూడు దశల్లో పనులు..మొదటి దశలో గద్దెల పునరుద్ధరణ, గద్దెల చుట్టూ ప్రహరీ, గద్దెల చుట్టూ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. రెండవ దశలో గద్దెల చుట్టూ కళాకృతులు, శాశ్వత నిర్మాణాలు, క్యూలైన్లు, జంపన్న వాగు చుట్టూ అభివృద్ధి పనులు చేపడతారు. మూడవ దశలో భక్తులకు మౌళిక వసతులు, రహదారుల పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
ఆదివాసీ గిరిజన సంప్రదాయానికి భంగం కలగకుండా నిర్మాణాలుఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా పునరుద్ధరణ పనులు చేస్తుంది ప్రభుత్వం. వనదేవత పూజారులు, ఆదివాసీ గిరిజన సంఘాల సూచనలు, అభిప్రాయాల మేరకు పనులు మొదలయ్యాయి. గద్దెలు నిర్మాణం, వనదేవత మూలాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో రాయితో రూపుదిద్దనున్నారు. వరుస క్రమంలో గద్దెలను తీర్చిదిద్దనున్నారు. ఇప్పుడున్న సమ్మక్క, సారలమ్మ గద్దెల వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉండనున్నాయి. 40 సంవత్సరాల తరువాత మేడారం గద్దెలు, గద్దెల ప్రాంగణం ఆధునీకరణ జరుగుతుండడంతో ఆదివాసీ గిరిజన సంప్రదాయానికి భంగం కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.
సమన్వయంతో ముందుకు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వదేవతల గద్దెల పునర్నిర్మాణంను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు సమన్వయంతో ముందుకు పోతున్నారు. స్థానిక మంత్రి సీతక్క ఆదివాసీ బిడ్డ కావడం, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి సురేఖ సైతం ఉమ్మడి జిల్లా మంత్రి కావడంతో ఇద్దరు మహిళా మంత్రులు ఇతర ప్రజా ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి పనికి టెండర్లు పిలవడం, సమయానికి పూర్తిచేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. మంత్రులు, అధికారుల్లో సమన్వయం లోపిస్తే కనుక 2026 జాతర నాటికి పనులు పూర్తి కావడం కష్టంగా మారి, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది.