Padma Rao Goud: టీఆర్ఎస్ పార్టీలో తాను అసంతృప్తిగా ఉన్నాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న ప్రచారాలు అవాస్తవం అని.. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు. తనకు సీఎం కేసీఆర్ తో ఉన్న సత్సంబంధాలు తెగిపోయానని చెప్తున్న వాళ్లకు తన గురించి ఏమాత్రం తెలియదన్నారు. తనకు టీఆర్ఎస్ పార్టీతో, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచే పోటీ చేస్తానని వివరించారు. 


బూర నర్సయ్య గౌడ్ చేరినప్పటి నుంచి..


టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరో మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరబోతున్నారని చెప్పడంతో అందరి దృష్టి పార్టీ సీనియర్ నేతలపై పడింది. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా బీజేపీలో చేరుబోతున్నారని చాలా మంది ఊహించారు. ఎన్నెన్నో వార్తలు కూడా వచ్చాయి. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్ ను కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ప్రచారానికి పద్మారావ్ గౌడ్ తెర దించారు. 


కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి అంతా తాను బీజేపీలో చేరుతాననని అకుంటున్నారని.. కానీ అతడిని కలవడానికి వేరే కారణం ఉందని వివరించారు. అయితే ఈ కారణం ఏంటో కూడా చెప్పారు. కిషన్ రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని.. అందుకే కలిశామన్నారు. అలాగే తాము ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నామని నాటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. పద్మారావు గౌడ్ ను కలవడంపై కిషన్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. పద్మారావ్ గౌడ్ కుమారుడి పెళ్లికి వెళ్లని కారణంగా... ఆయన ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. అయితే ఆ పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేశారన్నారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసి తప్పుడు ప్రచారం చేయకూడదని అన్నారు.


అందుకే మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు..


ఉద్యమ కాలం నుంచి జంట నగరాల్లో తెరాసలో ఉన్న మొదటి వ్యక్తిని తానేనని పద్మారావ్ గౌడ్ వివరించారు. తనకు ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనల వల్లే తాను మునుగోడుకు వెళ్లలేదని వివరించారు. లేదంటే కచ్చితంగా తాను మునుగోడుకు వెళ్లి.. టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసేవాడినని స్పష్టం చేశారు. ఇన్నేళ్లు బూర నర్సయ్య గౌడ్ కు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అన్న ఆయన.. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగొరవం ఎటు పోయిందని ప్రశ్నించారు. ఉద్యమ కారులకు మోసం జరగలేదని, మేము ఎవరిని మోసం చెయ్యలేదని చెప్పారు. అలాంటివి నిరూపిస్తే తాను పదవికి రాజీనామ చేయడానికైనా రెడీ అన్నారు.