Revanth Reddy: హైదరాబాద్‌ అంబర్‌ పేట్ లో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల బాలుడు చనిపోవడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల బాలుడు ప్రదీప్ చనిపోవడంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. బుధవారం (ఫిబ్రవరి 22) ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తన శాఖను సమర్థంగా నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కుక్కలు కరిచి మనిషి చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని అన్నారు. ఆ కుటుంబానికి కనీస నష్ట పరిహారం కూడా ప్రకటించకుండా, కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని అన్నారు. కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇదని అన్నారు. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకు వెళ్లకముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


నిన్న ఐదేళ్ల బాలుడిని నాలుగైదు కుక్కలు చుట్టుముట్టి కరిచి చంపేస్తే కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్ మాట్లాడడం ఏంటని ధ్వజమెత్తారు. వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యలు చేశారు. 


మంత్రి కేటీఆర్‌ను డ్రామారావుగా సంబోధిస్తూ.. ఇక్కడి ఎమ్మెల్యే భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామారావు రెడీనా అంటూ సవాలు విసిరారు. కేటీఆర్‌కు అందులో వాటాలు లేకపోతే, విచారణకు ఆదేశించాలని అన్నారు. నిరూపించడానికి తమ నాయకులు రెడీగా ఉన్నారని చెప్పారు. వరంగల్ జిల్లాను బీఆర్‌ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను తాను వదిలిపెట్టేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు అనుబంధంగా రేవంత్‌ రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ నెల 6న ములుగు జిల్లా మేడారం వనదేవతల సన్నిధి నుంచి ఆయన యాత్రను ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాలో మంగళవారం జోడో యాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డి చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సీ)కి రాత్రి చేరుకున్నారు. 


యాత్ర వాయిదా, మళ్లీ 28న..
భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్‌రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయపూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ ఉండటంతో జోడో యాత్రను వాయిదా వేశారు. 27న పరకాల నియోజకవర్గంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, 28న భూపాలపల్లి నియోజకవర్గంలో యాత్ర చేస్తారు. భూపాలపల్లి పట్టణ పరిధి కాశీంపల్లి నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర చేస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నక్సల్స్‌ ప్రాబల్య ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న రేవంత్‌ రెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో అడుగుపెడుతున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు ఏర్పాట్లు చేస్తున్నారు.