Priyanka Gandhi Rally: ఈనెల 20వ తేదీన ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ నాగర్‌కర్నూలు పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటన వాయిదా పడింది. ఆరోజు నిర్వహించాలనుకున్న ర్యాలీతో పాటు బహిరంగ సభను కూడా వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పార్టీలో చేరాల్సి ఉంది. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరు బహిరంగ సభలో పాల్గొనప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బాగుంటుందని భావించిన జూపల్లి.. కచ్చితంగా వారు హాజరు కావాలని పట్టుబట్టారు. కానీ ఏఐసీసీ అగ్రనేతలు బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బిజీగా ఉన్నారట. ఈక్రమంలోనే గాంధీ కుటుంబంలో ఎవరు, ముఖ్యంగా ప్రయాంక గాంధీ వస్తారా, రారా... వస్తే ఏరోజున వస్తారనేది ఇంకా చెప్పలేదు. దీని వల్లే ఈ పర్యటనను వాయిదా వేసినట్లు వివరించారు. 


జూపల్లికి కాదు.. జగదీశ్వర రావుకే టిక్కెట్ ఇవ్వాలంటున్న స్థానిక నేతలు


ఇదిలా ఉండగా.. సీనియర్‌ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతూ ఆ ప్రాంత స్థానిక నేతలు కోరుతున్నారు. కొల్లాపూర్‌ టిక్కెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వకుండా జూపల్లిని రప్పించాలని అంటున్నారు. అయితే జగదీశ్వర్‌ రావు ఆదివారం కొల్లాపూర్‌లో ర్యాలీ నిర్వహించి అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. జగదీశ్వర్‌ రావుకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేయడాన్ని పరిశీలించి ఏఐసీసీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని మల్లు రవికి నాగం విజ్ఞప్తి చేశారు. 'గెలుపు' ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని మల్లు రవి వివరించేందుకు ప్రయత్నించగా, పార్టీ సీనియర్ నేతలను విస్మరించి, పార్టీలో చేరే వారికి ప్రాధాన్యత ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని జగదీశ్వర్ రావు మద్దతుదారులు అన్నారు. 


ప్రజల, అనుచరుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ లోకి..!


జూపల్లి కృష్ణారావు మొదట కాంగ్రెస్ లోనే ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కూడా అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన  బీఆర్ఎస్ లో చేరడంతో ... జూపల్లి కృష్ణరావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక ఏ మార్గంలో వెళ్లాలనే అంశంపై అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. పొంగులేటితో  కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అభిప్రాయాలు తీసుకున్నారు చెప్పారు. సర్వేలు చేయించుకున్నారు. 80 శాతానికిపైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని  ఇద్దరు నేతలు చెప్పారు. ఈ మధ్య భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖమ్మం వేదికగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరారు. దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వచ్చారు. జూపల్లి చేరికకు ప్రియాంక వస్తారని మొదటి నుంచి టాక్ ఉంది. చివరకు వారం రోజుల క్రితం డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రియాంక తన పర్యటన వాయిదా వేస్కున్నారు.