నాలుగు నెలల క్రితం వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ప్రీతి కేసులో దర్యాప్తు ముగింపునకు వచ్చింది. ఇందులో భాగంగా కాకతీయ మెడికల్ కాలేజీలోని హాస్టల్‌లో నివసించే మెడికల్ స్టూడెంట్ ప్రీతి హాస్టల్ రూంని పోలీసులు బుధవారం (జూన్ 7) తెరిచారు. సీనియర్ విద్యార్థి ర్యాగింగ్‌ను తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రీతి మరణించిన తర్వాత గత 4 నెలలుగా ఆమె నివసించిన రూం నెంబర్ 409 మూసేసి ఉంది. కీలక ఆధారాల కోసం పోలీసులే ఆ గదికి తాళం వేసి ఉంచారు. నేడు కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు గది లాక్ ఓపెన్ చేశారు. ఆ సమయంలో ప్రీతి వస్తువుల్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రీతి లగేజీని ప్యాక్ చేసి అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రీతి హాస్టల్ గదిలో ఇంజెక్షన్లు, సూదులు, మెడికల్ కిట్స్ ను పోలీసులు గుర్తించారు.
ఛార్జిషీట్ దాఖలు
మరోవైపు ప్రీతి ఆత్మహత్య కేసులో వరంగల్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలతో కలిపి, 970 పేజీలతో కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ వేధింపులే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కులం పేరు ప్రస్తావించడంతో పాటు ర్యాగింగ్ చేయడం వల్ల, ప్రీతి డిప్రెషన్‌కు లోనై, ఆత్మహత్య చేసుకుందని చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ప్రీతి కాలేజీలో చేరినప్పటి నుంచి, సైఫ్ హేళన చేసేలా మాట్లాడి, మానసికంగా ఇబ్బందులు పెట్టేవాడని తెలిపారు. ఆ వేధింపులు భరించలేక.. ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 08.10 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పారు.
ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించి.. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. మృతురాలు, నిందితుడు, వారి ఫ్రెండ్స్ వాడిన సెల్‌ఫోన్‌ల డేటాను రాబట్టామని, మృతురాలి మరణంపై కేసుకు సంబందించిన అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించామని పోలీసులు చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాత విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ ఎంఏ సైఫ్ ర్యాగింగ్ పేరుతో వేధించడం వల్లే, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది. మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.