తెలంగాణలో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్‌లో మాత్రం నామమాత్రంగా ధాన్యం కొంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తరహాలోనే ఛత్తీస్‌గఢ్‌లో వరి, పత్తి సాగవుతుందని, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎంత ధాన్యం పండించినా ఎకరానికి పరిమితంగానే ధాన్యం కొంటారని అన్నారు. మిగతా ధాన్యమంతా రైతులు మార్కెట్‌కు వెళ్లి మిల్లర్ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందేనని అన్నారు. పండించిన ధాన్యానికి ప్రభుత్వ రక్షణ లేదని, ప్రభుత్వ మద్దతు ధర కూడా లేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డేలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఉంటే.. ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడతరని అన్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది’’ అని కేటీఆర్ అన్నారు.
అక్కడ ఇంకా కొనపాయె వడ్లు.. ఇంక ఎన్నడు కొంటరు? ఇంకేం చేస్తరు ఎగిరెగిరిపడుతరు. అక్కడ ఇచ్చేది ఎకరానికి రూ.2 వేలు కూడా పంట పెట్టుబడికి ఇచ్చేది లేదు. ఇక్కడ తెలంగాణలో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న కేసీఆర్ ని అదే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నరు. అక్కడ మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు. ఇక్కడకు వచ్చి మాత్రం పెద్ద డైలాగ్‌లు, యాక్టింగ్‌లు, ఉపన్యాసాలు, ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నరు.
ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి
‘‘రూ.65 కోట్లతో కలెక్టర్ కార్యాలయానికి నేడు లాంచనంగా శంకుస్థాపన చేసుకున్నాం. ములుగు జిల్లా ఎస్పీ ఆఫీసుకు రూ.38.50 కోట్లతో హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. రూ.12 కోట్లతో 5 మోడల్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన, ఓ మోడల్ స్టేషన్‌కు ప్రారంభం చేసుకున్నాం. బస్ డిపో ఉండాలంటే రూ.10 కోట్లతో, రూ.4 కోట్లతో సీసీరోడ్లు, మురికి కాలువలు, రూ.కోటితో వైకుంఠధామం, రూ.30 లక్షలతో లైబ్రరీలకు శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ప్రజలపై ప్రేమతో, అభిమానంతో మంత్రులను ఇక్కడికి పంపారు. 116 మంది దళితులకు రూ.2.39 కోట్లు, ఎస్టీలకు రూ.1.45కోట్ల బ్యాంకు ద్వారా సబ్సిడీ అందించనున్నాం. 3 వేల మంది యాదవులకు రూ.1.87 లక్షల సబ్సిడీతో గొర్రెల పంపిణీ జరుగుతోంది.
33 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇవ్వబోతున్నాం. 37 కుటుంబాలకు ఇంటి పట్టాలు, 4 ఫిషరీ సొసైటీలకు రిజిస్ట్రేషన్ పట్టాలు, 1181 మహిళా సంఘాలకు రూ.110 కోట్ల విలువైన చెక్కులు, మూడు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లాలోనే 17 వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు అందజేయనున్నాం’’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.