రామప్ప ఆలయానికి యునెస్కోగుర్తింపు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.  ఈసందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని… కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని కొనియాడారు. ప్రతిఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలన్నారు..




రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. 




కాకతీయుల శిల్పకళా వైభవం రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపు.. మన తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.




తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రామప్ప ఆలయానికి వారసత్వ హోదా గుర్తింపు లభించిందన్నారు మంత్రి శ్రీనివాసగౌడ్.  ఇది తెలంగాణ వారంద‌రికి గర్వకారణమన్నారు.  మన రామప్పకు ఈ ఘనకీర్తి దక్కడం సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉంద‌న్నారు పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు. చారిత్రక వార‌స‌త్వ క‌ట్టడమై రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తమైంద‌ని హర్షం వ్యక్తం చేశారు.


రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కడం వెనుక సీఎం కేసీఆర్‌ కృషి ఎంతో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ రోజు ఎంతో చారిత్రకమైందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రామప్ప చోటు సాధించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. కాకతీయ కళానైపుణ్యానికి ప్రపంచస్థాయిలో గొప్ప గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారని, మంత్రుల బృందాన్ని సైతం పంపి ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు.ఇందులో తానూ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు