సాధారణంగా ఈ-కామర్స్​ ప్లాట్​​ఫామ్​లు నిర్వహించే మెగాసేల్స్ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా వేచిచూస్తారు. భారీ ఆఫర్లతో కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తారు. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక ‘ప్రైమ్‌ డే సేల్‌’లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. జులై 26 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి ‘అడ్వాంటేజ్‌-జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌’ పేరిట ప్రైమ్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అయితే ఈ సేల్ లో పాల్గొనేవారు ఎడా పెడా కొనేయడం కాదు…కొన్ని జాగ్రత్తలు తీసుకుని షాపింగ్ చేయడం మంచిందంటున్నారు ఆర్థిక నిపుణులు…


అసలే కరోనా కాలం…కొందరు ఉద్యోగాలు కోల్పోయారు…మరికొందరు సగం జీతానికే పనిచేస్తున్నారు. పైగా పెరిగిన నిత్యవసరాల ధరలు…ఇలాంటి పరిస్థితిలో...ఖర్చు చేసేముందు కాస్త ఆలోచిస్తే మంచిది. ఆఫర్ ఉందికదా అని అవసరం లేకపోయినా కొనేయకూడదు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేయాలి. అలాగే మొదటి సారి ఉద్యోగంలో చేరినవారు తమ పరిధి మేర ఖర్చు  చేయాలని సూచిస్తున్నారు ఆర్థికనిపుణులు.




మెగాసేల్​లో షాపింగ్ చేయాలనుకునే వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే..


ప్లానింగ్​​, బడ్జెట్​
కొనాలనుకున్న వస్తువులేవో ముందుగానే అమెజాన్​ విష్​లిస్ట్​లో సేవ్ చేసుకోవాలి. ఆఫర్లను కూడా ముందుగానే చెక్ చేసుకోవాలి. ఆఫర్ మొదలైన వెంటనే నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. భారీ డిస్కౌంట్లలో ఉన్నాయి కదా అని అవసరం లేని వస్తువులను కొనడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితిని బట్టి బడ్జెట్​ను ముందే ప్లాన్ చేసుకుని ఆ పరిధి దాటకుండా చూసుకోవాలి.



ఆఫ్​లైన్ డిస్కౌంట్లతో పోల్చాలి
ఈకామర్స్​ సేల్స్​లో భారీ డిస్కౌంట్ ఉన్న ఉత్పత్తుల ధరలు ఆఫ్​లైన్ మార్కెట్​లో ఎలా ఉన్నాయో కూడా ఆరా తీస్తే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి బయట ఇంకా తక్కువకు దొరికే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

కార్డులు, రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు
ముఖ్యంగా సేల్స్​ జరుగుతున్న సమయంలో ఏవైనా కార్డులపై ఆఫర్ ఉందేమో చూడాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రేమ్ సేల్​లో హెచ్​డీఎఫ్​సీ కార్డులతో షాపింగ్ చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ వస్తుంది. గరిష్ఠంగా రూ.1500ల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగిస్తే 5 శాతం క్యాష్​బ్యాక్ వస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన ప్రొడక్టులకు ప్రత్యేకమైన కార్డు ఆఫర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా పరిశీలించాలి.





ఈఎంఐలతో జాగ్రత్త
అధిక ధర ఉండే వస్తువులను ఈఐఎం పద్ధతిలో తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి తరుణంలోనే ఈఎంఐపై వడ్డీ ఎంత పడుతుందో చూడాలి. ముఖ్యంగా సేల్స్ సమయంలో జీరో కాస్ట్ ఈఎంఐలు నడుస్తుంటాయి. అయితే జీరో కాస్ట్ ఈఎంఐ అనేది పూర్తి వడ్డీ మినహాయింపు కాదని గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఏ మేరకు చార్జీలు విధిస్తుందో తెలుసుకోవాలి. ఈ-కామర్స్ ఫ్లాట్​ఫామ్ ఆ మేర డిస్కౌంట్ ఇస్తుందో లేదో పరిశీలించాలి. అలాగే కొన్ని వస్తువులపై భారీ ఆఫర్లు కొంతసేపే ఫ్లాష్​సేల్ పద్ధతిలో ఉంటాయి. అందుకే నిశితంగా గమనించి షాపింగ్ చేయాలి.




ఇక ‘అడ్వాంటేజ్‌-జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌ ప్రోగ్రాం’ కింద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కలిగిన వారు తక్కువ వడ్డీరేటు, ఎక్కువ ఈఎంఐలతో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ కూడా అందిస్తోంది. సాధారణంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌కు ఫోన్‌ ధరలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సైతం అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు ‘యూత్‌ ఆఫర్‌’ కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ప్రైమ్‌కు సైన్‌ అప్‌ అయిన తర్వాత వయసును ధ్రువీకరించి వెంటనే 50 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందడం ద్వారా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకుకోవచ్చు.