Operation Smile: బాలల సమస్యలు లేని ఆదర్శ జిల్లాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తీర్చిదిద్దాలని, అందుకోసం అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు కోరారు. 2023వ సంవత్సరం నేటి నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ తొమ్మిదవ విడత ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు, మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మిక శాఖ, విద్య శాఖ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
ప్రత్యేక బృందాలు..
ఒక ఐస్ఐ, నలుగురు పీసిలు, డీసీపీయూ సిబ్బంది, సహాయ కార్మిక అధికారి, రెవెన్యూ అర్.ఐ, చైల్డ్ లైన్ సిబ్బందితో కలిపి జిల్లాలో డివిజన్ స్థాయిలలో రెండు బృందాలను ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. ఈ బృందాలు జిల్లాలో తప్పిపోయిన, పారిపోయిన బాల బాలికలను, బాల కార్మికులను, బిక్షాటన చేసే పిల్లలను, అక్రమ రవాణాకు గురైన పిల్లలను గుర్తించి, బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరుస్తుందని పేర్కొన్నారు. నిరాశ్రయులైన పిల్లలకు వివిధ స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వ బాల సధనాల్లో ఆశ్రయం కల్పిస్తుందని, తద్వారా వారికి బంగారు భవిష్యత్తు అందించవచ్చని సూచించారు. గత సంవత్సరం 2022లో 52 మంది బాల బాలికలను కాపాడినట్లు తెలిపారు. అంతే కాకుండా, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పిల్లలకు డీసీపీయూ అధ్వర్యంలో చదువు చెప్పించడం జరుగుతుందని, అలాగే వృత్తి విద్య కోర్సుల్లో కూడా శిక్షణను ఇప్పిస్తుందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్ తొమ్మిదో విడత
కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆపరేషన్ స్మైల్ తొమ్మిదో విడత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం అంటే జనవరి ఒకటో తేదీన ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ కార్యక్రమంలో హోటల్లు, పరిశ్రమల్లో పని చేసే బాల కార్మికులను, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, పార్కుల్లో అనాథలుగా తిరుగుతూ కనిపించే చిన్నారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం, ఎవరూ లేని వారిని వసతి గృహాల్లో చేర్చించడం చేస్తారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులతో మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి శుక్రవారం తన కార్యాలయం నుంచి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. గతేడాతి ఆపరేషమ్ స్మైల్-8 కార్యక్రమంలో 2,822 మంది చిన్నారుల్ని రక్షించామని చెప్పారు.
అందులో రెండు వేల 463 మంది చిన్నారుల్ని తల్లిదండ్రులకు అప్పగించగా.. 359 మందిని వసతి గృహాల్లో చేర్చించినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-8లో 3 వేల 406 మంది చిన్నారుల్ని రక్షించారు. వారిలో 2 వేల 824 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చగా.. 582 మందిని వతి గృహాల్లో చేర్పించినట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.