ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఈవిడ ఎంత సాధారణ జీవితం అనుసరించే వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డు పక్కనే కూర్చొని బువ్వ తింటారు. అవసరమైతే కాలువలో పారే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటారు. కొండలు, గుట్టలు లెక్క చేయడకుండా కిలో మీటర్ల కొద్దీ తలపై సంచులు మోస్తూ, నడుస్తూ పేదవారికి సాయం చేయడంలో ముందుంటారు. కరోనా సమయంలో ఈమె చేసిన సహాయ కార్యక్రమాలు ఎంతగా జనాల్ని ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విటర్ లో ఇతర రాష్ట్రాల నెటిజన్లు సైతం ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. ఇక వరదలు వచ్చినప్పుడు, వాగులు చెరువులు ఉప్పొంగుతున్నా లెక్క చేయక నేరుగా  బాధితుల వద్దకు వెళ్తారు. సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. ములుగు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.


అలాంటి సీతక్క తాజాగా ఓ పిల్లవాడికి హెయిర్ కట్ చేశారు. దువ్వెన, కత్తెర చేత బట్టి, చెలిమె వద్ద ఓ కుర్రాడికి కటింగ్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అతను అద్దం పట్టుకుంటే ఆమె హెయిర్ కట్ చేశారు. పక్కన వాగులో మిగతా పిల్లలు కూడా స్నానం చేస్తున్నారు. 


రెండ్రోజుల క్రితం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ఓ చిన్న కుంట వద్ద ఆగారు. అక్కడున్న పిల్లల్ని చూసి ముచ్చట పడి వారితో సరదాగా మాట కలిపారు. నగరాల్లో పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగులు, వాటిలో మెరుగైన సదుపాయాల ఉంటాయని, అక్కడ వచ్చే ఆనందం కన్నా ఇలా చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం వల్ల కలిగే ఆనందం వర్ణించలేనిదని సీతక్క ట్వీట్ చేశారు. సోపతులతో కలిసి ఆడుకోవడం, చద్దులను తినడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. ఎంతయిన గ్రామాలు గ్రామాలేనని ట్వీట్ చేశారు.


విపక్ష నేతలను సైతం పదునైన విమర్శలు చేస్తుండే సీతక్క ఇలా పిల్లలను చూడగానే పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. అందుకే తన కారు ఆపి.. వారితో కాసేపు గడిపానని తెలిపారు. అలా ఒకతనికి కటింగ్ చేశానని ఆమె వివరించారు. ఈ ట్వీట్‌ చూసిన చాలా మంది శభాష్ సీతక్క అని అభినందిస్తున్నారు.