Mulugu SI Conspiracy News: ఊరుకు ఒక్కడే రౌడీ ఉండాలి అది పోలీసుసోడు అయ్యి ఉండాలి.. ఇది ఒక సినిమాలో డైలాగ్. ఆ సినిమా డైలాగ్ ను నిజం చేస్తున్నారు కొంత మంది పోలీసులు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ముందుకు వెళ్తుంటే ఈ పోలీసుల తీరు చూస్తుంటే ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారైయ్యారనే అనిపిస్తుంది. ఇటీవల ఓ కేసులో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల లొల్లి విషయం బయటికి వచ్చింది. హద్దు మీరిన ఓ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్సై వ్యవహారం కూడా బయటికి వచ్చింది. తాజాగా ఓ ఎస్సై కానిస్టేబుల్‌ను అంతమొందించేందుకు చేసిన దిమ్మతిరిగే వ్యవహారం బయటికి వచ్చింది.
ములుగు జిల్లాలో (Mulugu District) ఓ కానిస్టేబుల్ తన కెరీర్ మెరుగు కోసం వేసిన భారీ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని పసిగట్టడంతో మొత్తం స్కెచ్ భగ్నం అయింది. ఓ వైపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, వారితోనే తన ఎదుగుదలకు బాటగా మార్చుకొనేందుకు ప్రణాళికలు వేశాడు. ఆ క్రమంలో భాగంగా ఓ హెడ్ కానిస్టేబుల్‌ను చంపించేందుకు కూడా వెనుకాడలేదు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మావోయిస్టుల మాదిరిగా ఓ దళాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారని వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో అందుకు సంబంధించి ట్రయల్స్ కూడా చేశారని సమాచారం. వారి కదలికల ద్వారా మావోలు ఉన్నారని భద్ర కల్పించి, వారు హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపించారని నమ్మించాలని స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్‌ఐ పకడ్బందీగా జరిపిన ఈ కుట్ర కోణాన్ని హైదరాబాద్‌లోని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ములుగు పోలీసుల సహకారంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. సదరు ఏఆర్ ఎస్‌ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా తెలిసింది.
ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి ఆ సభ్యులతో కొన్ని కార్యకలాపాలు సాగించి, తిరిగి వారిని ఎన్‌కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్ శాఖలోనూ పేరు తెచ్చుకోవాలని ఎస్సై కుట్ర పన్నారని తెలుస్తోంది. మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్ టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్‌కౌంటర్ చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోలు ఉన్నట్లు భ్రమ కల్పించడంతోపాట, వారిని ఎన్ కౌంటర్ చేసి పోలీసు అధికారుల మెప్పు పొంది ప్రమోషన్లు పొందాలని కుట్ర పన్నినట్లు తెలిసింది.ముందే ఈ వివరాలన్నీ నిఘా విభాగం గుర్తించడంతో వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.