తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సభాస్థలి, ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. అనంతరం 24 కోట్ల రూపాయల తో నిర్మించిన 416 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారని చెప్పారు. 5 ఇంక్లైన్ వద్ద ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో 45 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం అంగడి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
సీఎం కోసం ఎదురు చూపులు..
జిల్లాలో గత నెల మొదటి వారంలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రారంభించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు సీఎం వస్తారని.. జిల్లాకు మరిన్ని అభివృద్ధి పనులకు వరాల జల్లు కురిపిస్తారని అంతా ఎదురుచూశారు. గత నెల మొదటి వారంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా ఈ భవనాలు ప్రారంభించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ, పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల కోడ్ వచ్చే లోపే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, పర్యటన వాయిదా పడడంతో మంత్రి కేటీఆర్ చేతుల మీద ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. రూ.50కోట్ల నిధులతో సమీకృత కలెక్టరేట్, రూ.37కోట్లతో ఎస్పీ కార్యాలయం, రూ.24కోట్లతో 440 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ భవనాలను ప్రారంభించి అనంతరం పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలను మంత్రి కేటీఆర్ అక్టోబర్ 9న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ భవేష్‌మిశ్రా తెలిపారు. కలెక్టర్ భవేష్‌మిశ్రా నూతన కలెక్టరేట్‌ను శనివారం సందర్శించి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్‌మిశ్రా మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకుంటారని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభం, రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, విడత దళిత బంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
పర్యటనను విజయవంతం చేయాలి
మంత్రి కేటీఆర్ పర్యటినను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయాల ప్రారంభం అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకల గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ తెలిపారు.