జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్థానికేతరుడు కాదంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. తాను బతికున్నంత వరకూ జనగామ గడ్డపైనే ఉంటానని స్పష్టం చేశారు. తాను తనువు చాలిస్తే జనగామ గడ్డమీదే కట్టె కాలుతుందని మాట్లాడారు. తన చితా భస్మాన్ని నియోజక వర్గంలోని ప్రతి చెరువులో కలపాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో సోమవారం (మే 22) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


తరచూ తనను స్థానికేతరుడని అనడం  సరికాదని అన్నారు. పార్టీలో అక్కడక్కడా కొండెంగలు, గుంట నక్కలు, చీడ పురుగులు ఉన్నాయని, సొంత పార్టీకి చెందిన వారిపైనేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని స్వయంగా సీఎం చెప్పారని అన్నారు. 


ఇలాంటి నీచమైన రాజకీయాలు సీఎం కేసీఆర్ ఎదుట సాగబోవని అన్నారు. తన పని తీరు సీఎం కేసీఆరే స్వయంగా మెచ్చుకున్నారని చెప్పారని అన్నారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజల పక్షాన నిలబడితేనే ఆదరిస్తారని సూచించారు. టీఆర్ఎస్ తరపు నుంచి 2014, 2018 ఎన్నికలకు ముందు తనకు టికెట్ దక్కకుండా ఉండడానికి కొంత మంది కుట్రలు చేశారని ఆరోపించారు. 


ఇటీవల ఎమ్మెల్యేపై కూతురు ఫిర్యాదు


జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూమిపై తీవ్ర వివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ విపక్షాల ఆరోపించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ఇదే విషయమై తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. 


ప్రత్యర్థులు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు - ఎమ్మెల్యే


తన కూతురు తనపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థులు కావాలనే కుట్ర పన్ని తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చేర్యాలలోని సర్వే నంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ చేసిందని.. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హైదరాబాద్  ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు పేరు మీద 125 నుండి 150 గజాల స్థలం ఉందని.. అందులోనూ ఎలాంటి ఫోర్జరీ లేదని చెప్పుకొచ్చారు. కిరాయి నామా దస్తావేజు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.