జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆమె తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తన తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న భూమి లీజ్ అగ్రిమెంటు మార్చారని కుమార్తె తుల్జా భవాని రెడ్డి తండ్రిపైనే కేసు పెట్టారు. తాజాగా చేర్యాల భూమి విషయంలో ఆమె తండ్రిని అందరిముందే నిలదీశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం సందర్బంగా జనగామలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సోమవారం (జూన్ 19) పాల్గొన్నారు. 


అక్కడికి కూతురు తుల్జా భవానీ రెడ్డి చేరుకున్నారు. తన తండ్రి చేతికి డాక్యుమెంట్ ఇచ్చి దానిపై ఉన్న సంతకాలు ఎవరివి అని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఆ సమయంలో ఎదురుగానే మీడియా ప్రతినిధులు, కెమెరాలతో సహా ఉన్నారు. కుమార్తె అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బదులిస్తూ.. నీదే కదా! అంటూ సమాధానం ఇచ్చారు. ఆ సంతకం నాది కాదు, ఫోర్జరీ చేశారని ఫోరెన్సిక్ పరీక్షలో తేలుతుందని ఆమె అన్నారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంగుతిన్నారు. అక్కడి నుంచి కుమార్తె వెళ్లిపోయారు. ‘మా అమ్మాయి తనకు తెలియకుండా ఆమె పేరు మీద ప్రాపర్టీ పెడుతున్నారని కేసు ఫైల్ చేయడానికి వచ్చింది’ అని పక్కనున్నవారితో చెప్పి ఇతరుల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశారు.


ఇదిలా ఉండగా.. అందరి ముందు కుమార్తె నిలదీయడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత కంటతడి కూడా పెట్టారు. కూతురును తన రాజకీయ ప్రత్యర్థులు తప్పు దోవ పట్టించి తనపై ఉసిగొలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వస్తున్న ఆరోపణలలో నిజం లేదని, కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్థులు వాడుకుంటున్నారని అన్నారు.


మే 9న కేసు నమోదు


ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూమిపై తీవ్ర వివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ విపక్షాల ఆరోపించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ఇదే విషయమై తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. 


కావాలనే ప్రత్యర్థులు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు..!


తన కూతురు తనపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థులు కావాలనే కుట్ర పన్ని తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చేర్యాలలోని సర్వే నంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ చేసిందని.. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హైదరాబాద్  ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు పేరు మీద 125 నుండి 150 గజాల స్థలం ఉందని.. అందులోనూ ఎలాంటి ఫోర్జరీ లేదని చెప్పుకొచ్చారు. కిరాయి నామా దస్తావేజు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.