Telangana Employees DA Hike: తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ పెంచుతూ 'సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది. 2.73 శాతం పెంచింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ద ఉత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ నెల వేతనంతో పెరిగిన డీఏ చెల్లించనున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రభుత్వ తాజా ఉత్వర్వులతో పెన్షనర్లతో సహా 7.28 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. అందరి శ్రేయస్సే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు.


2.73 శాతం డీఏ పెంపుతో రూ.1,380 కోట్ల ఎరియర్స్ ను ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై నెలకు రూ.81.18 కోట్లు, ఏడాదికి రూ.974.16 కోట్ల మేర భారం పడనుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. 


పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచిన కేసీఆర్
మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1 లక్షా 6 వేల 474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మే నెల నుంచి పెరిగిన వేతనాలను పారిశుధ్య కార్మికులు అందుకోనున్నారు. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.


జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.


(Junior Panchayat Secretaries) జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ గత నెల (మే)లో నిర్ణయించారు. దీనికి సంబంధించి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల పని తీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి ఆఫీసర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.