Telangana News: వరంగల్‌ 1 ఏప్రిల్‌ 2024: కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై వస్తున్న విమర్శలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరంగల్‌లో కుమార్తె కావ్యతో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కడియం శ్రీహరి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే... "ఇది నా చివరి ఎన్నిక కావచ్చు. నీతి నిజాయితీగా రాజకీయం చేశాను. పీసీసీ పెద్దల ఆహ్వానంతోనే  కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు,కార్యకర్తలు ఆశీర్వదించాలి. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. అని అన్నారు.


కాంగ్రెస్‌ వల్లే సాధ్యం


అటు బీజేపీపై కూడా కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న మోదీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కి మాత్రమే ఉందన్నారు. "మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తుంది. సీబీఐ,ఈడి కేసుల ద్వారా ప్రతిపక్షాలను  ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీలో చేరగానే కేసులన్నీ వాయిదా వేస్తున్నారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేదు. మణిపూర్ అల్లర్లు భారతదేశానికి మాయని మచ్చలా మిగిలాయి. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కే ఉంది. 


కేసీఆర్‌పై విమర్శలు చేయను


బీఆర్‌ఎస్‌ పార్టీని వీడినప్పటికీ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై గౌరవం ఉందన్నారు కడియం శ్రీహరి. బీజేపీ ఆగడాలను అడ్డుకోవడానికి, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను చెప్పుకొచ్చారు. " బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగా ఉంది. కేసీఆర్ పట్ల గౌరవం ఉంది. కేసీఆర్‌పై విమర్శలు చేయదల్చుకోలేదు. నేను పార్టీ మారగానే నాపై జిల్లా నాయకులు కూడా విమర్శల చేస్తున్నారు. వాళ్లు విమర్శించిన పద్దతి బాగాలేదు. అనవసరమైన కామెంట్స్ చేశారు."  


పద్దతి మార్చుకోవాలి


బీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న రాజకీయాలపై కూడా కడియం స్పందించారు. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "పాలకుర్తి ప్రజలే ఎర్రబెల్లిని ఛీ కొట్టారు. అహంకారపూరిత మాటల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. పార్టీ ఈ పరిస్థితిలో ఉండటానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారే కారణం. ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతలకు ప్రజలే బుద్ది చెబుతారు. ఇలాంటి వారి అందరి చరిత్ర నా దగ్గర ఉంది. ఆ చిట్టా విప్పితే తట్టుకోలేరు. అంటు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.