TS TET 2024 APPLICATION: తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు నిరుద్యోగులు, అటు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు దీనిపై స్పందించారు. టెట్ ఫీజులను భారీగా పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం.. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏప్రిల్ 1న హరీశ్ రావు లేఖ రాశారు. 


బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా.. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజును వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌కు రెట్టింపు ఉన్నాయన్నారు. రిజర్వుడు విభాగం విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని హరీశ్‌రావు లేఖలో ప్రస్తావించారు. 


జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తోందని, టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని హరీశ్‌రావు వివరించారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు.


కొనసాగుతున్న టెట్ దరఖాస్తు ప్రక్రియ..
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)-2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు.


మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.   దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.


తెలంగాణ టెట్ దరఖాస్తు, అర్హతలు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..