Minister Puvvada Ajay Kumar: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ ఓ పిల్లా బచ్చా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన అభివృద్ధే తమను మరోసారి ఎన్నికల్లో గెలిపిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తాను పోటీ చేసీ గెలవడం కాదు, అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలుస్తానంటూ పొంగులేటి కామెంట్లు చేశారు. దీనిపై స్పందిస్తూ మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. పొంగులేటి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని.. పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి అన్నారు. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి సీఎం కేసీఆర్ విలువ తెలిసి వస్తుందని అన్నారు.
రోజుకో వేషం వేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు..!
ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి బచ్చా అని.. రోజుకో వేషం వేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లకు తాను భయపడాల్సిన అవసరం లేదని.. నీవే నిలబడినా, ఎవర్నైనా నిలబెట్టినా.. గెలవబోయేది నేనే అని చెప్పుకొచ్చారు. పొంగులేటి సీఎం అవుతానని మురిసిపోతున్నాడని, నువ్వు సీఎం ఏంటయ్యా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలన్నారు. నీలా వందల కోట్లు దోచుకున్న వాళ్లు జైలుకు వెళ్తారే తప్ప ముఖ్యమంత్రి కాలేరని పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. పొంగులేటి కేసులు ఎక్కడికీ పోలేవాని.. ఆయన చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు అందరూ త్వరలోనే ఖమ్మం వస్తున్నారని వివరించారు.
నీ డబ్బు.. ఖమ్మం ప్రజల ఎడమ కాలి చెప్పుతో సమానం
డబ్బు ఉందనే గర్వంతో విర్రవీగుతున్న ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన డబ్బు ఖమ్మం ప్రజల ఎడమ కాలు చెప్పుతో సమానం అని తెలిపారు. ఖమ్మం రాజకీయ చరిత్రలో పుట్టినవాడే ఈ పువ్వాడ అజయ్ కుమార్ అంటూ తన గురించి తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అని తెలిపారు. తాను చేసిన అవినీతిని ఏమైనా ఉంటే నిరూపించమని సవాల్ విసిరారు. పార్టీ నేతలకు వెన్నుపోటు పొడిచిన నీకు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలే సమాధానం చెబుతారంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో పదికి 10 స్థానాలు వస్తాయని, క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్పై విమర్శలు చేసిన వారు శంకరగిరి మాన్యాలలో కలిసి పోయారని అన్నారు. తాము ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్ఎస్ కు ఘన విజయాన్ని అందిస్తాయన్నారు. డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవని చెప్పారు. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారని, పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్న వారికి ఓటర్లు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.