ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ శుక్రవారం (జూన్ 30) మహబూబాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు మంత్రి చేశారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో మంత్రి కేటీఆర్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హజరయ్యారు. 


ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ వెనుక నుంచి వేగంగా వచ్చి మంత్రి కేటీఆర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఎమ్మెల్యే చేయిని అందుకొని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి విసిరినట్లు తోసేశారు. దాంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నమస్కారం పెట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కేటీఆర్ తీరు పట్ల విమర్శలు చేస్తున్నారు.






మహబూబాబాద్ పర్యటనలో భాగంగా గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్ అండ్‌ నాన్‌వెజ్‌, ఫ్రూట్స్‌, ఫ్లవర్‌ మార్కెట్లను ప్రారంభించారు.