ఉమ్మడి ఏపీ విభజన అంశంపై, తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం రేగుతోంది. తాజాగా వరంగల్ పర్యటనలో మంత్రి హరీశ్ రావు మరోసారి ప్రధాని మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపినా కలుపుతారంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరులను మోదీ కించపర్చారని.. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ త్యాగాలను, ఆకాంక్షను లోకువగా చేసి మోదీ చూస్తున్నారని మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు గురువారం వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్యటించారు.


వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో రూ. 42 లక్షలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ యూనిట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, బస్వరాజు సారయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


మోదీ వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆ రోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆయన కామెంట్ చేశారని.. మోదీ, బీజేపీ నాయకులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ చట్టాల విషయంలో మూజువాణి ఓటుతో ఎలా బిల్‌ పాస్ చేశారని నిలదీశారు.  తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మోదీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. 


దేశంలో ఏడు ఉత్తమ గ్రామాలు ఉంటే అందులో ఏడు తెలంగాణకే వచ్చాయని గుర్తు చేశారు. తమ పనితీరుకు ఇది కూడా ఒక నిదర్శనమని చెప్పారు. వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వలస కూలీలను సొంత ప్రాంతాలకు పంపకుండా విఫలమయ్యారని, సాయం చేసిన వాళ్లపై అనవసర మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూపీలో కుంభమేళా పెడితే అక్కడ కరోనా పెరగలేదా? అని ప్రశ్నించారు. సభలు, ఎన్నికల ర్యాలీలతో కరోనా పెరగలేదా అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు.