Mederam Temple Close: స్థలం.. అన్నదమ్ముల మధ్య, ఆప్తుల మధ్య కారణమవుతుంది. పూర్వం భూముల కోసం, రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి. అయితే రాజుల కాలంలో ఏం జరిగినా దేవుడి స్థలాల జోలికి వెళ్లేవారు కాదు. ఆయా రాజ్యాల రాజులు మారినా దేవుడి స్థలాలు, మాన్యాలను కొత్తగా వచ్చిన వారు కాపాడేవారు. అయితే కాలం మారుతూ వస్తోంది. మన్యాలు అన్నీ అన్యాక్రాతం అయ్యాయి. ఇంకొన్ని కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. 


తాజాగా ఇలాంటి స్థల వివాదం ఏకంగా వనదేవతలు సమ్మక్క, సారలమ్మ ఆలయం (Sammakka Saralamma Temple) మూసివేతకు కారణం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt), పూజారుల (Mederam Priests) మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ కుంభమేళా అయిన సమ్మక్క సారలమ్మ ఆలయం (Mederam Temple) మూసివేతకు కారణమైంది. వరంగల్ పాత సెంట్రల్ జైలు ఎదుట ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని.. ఇప్పుడు ఆ స్థలాన్ని భద్రకాళీ ఆలయానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేడారం పూజారులు ఆరోపించారు. ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు ఆలయం మూసివేసివేతకు నిర్ణయించారు. మే 29, 30 తేదీల్లో ఆలయానికి తాళాలు వేసి వరంగల్‌లోని సెంట్రల్ జైలు ఎదుట తమకు కేటాయించిన స్థలంలోనే ధర్నా చేపట్టనున్నట్లు పూజారులు తెలిపారు. వివాదానికి ప్రభుత్వమే కారణమని పూజారులు ఆరోపిస్తున్నారు. 


రెండు రోజుల క్రితం సమావేశం
అమ్మవార్ల గద్దెల ఆవరణలో రెండు రోజుల క్రితం అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించేందుకు ఒత్తిడి పెరుగుతోందని అర్చకులు ఆరోపించారు. ఆయా స్థలాలను అధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు సైతం చెబుతున్నారు. వాస్తవానికి 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్‌ వరంగల్‌లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం కేటాయించారు. అలాగే భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుంచి నిధులు సేకరించి 2 కోట్లతో నగరం నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించారు. 


ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు దేవాదాయ శాఖ అధికారులపై వత్తిడి పెంచుతున్నారు. దానిని వ్యతిరేకిస్తూ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని కొనసాగించాలని మేడారం అర్చకులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తమ వాదనలను పట్టించకోవడం లేదని, ఇందుకు నిరసనగా రెండు రోజుల పాటు అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేసి ధర్నా నిర్వహించనున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. అధికారులు స్పందించకుంటే జూన్ మొదటి వారంలో వరంగల్‌లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.