Medaram Jatara: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో అత్యంత కీలకమైన ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆ శుభ ఘడియ రానే వచ్చింది. చిలకల గుట్ట నుంచి వన దేవత సమ్మక్క తల్లి జనారణ్యంలోకి అడుగుపెట్టింది. బుధవారం రాత్రి సారలమ్మ గద్దె పైకి చేరగా, గురువారం రాత్రి సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం గడ్డ భక్తి పారవశ్యంతో పులకించి పోయింది. జయజయధ్వానాలు , శివ సత్తుల పూనకాలు, ఆదివాసీల డోలు వాయిద్యాల మధ్య మేడారం అడవి ఆధ్యాత్మిక హోరుతో మార్మోగింది.
చిలక గుట్ట నుంచి గద్దెల వరకు, అద్భుత ప్రస్థానం
జాతరలో ప్రదాన ఘట్టం సమ్మక్క రాకతోనే పూర్తవుతుంది. గురువారం సాయంత్రం చిలకల గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు అత్యంత గోప్యంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని పవిత్రమైన వెదురు బుట్టలో భద్రపరిచి, పూజారులు గుట్ట దిగుతుండగా భక్తులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సమ్మక్క తల్లికి జై, సారలమ్మ తల్లికి జై అని నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ మారుమోగాయి.
అమ్మవారిని గద్దె పైకి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం తరఫున మంత్రులు సీతక్క లక్ష్మణ్‌తోపాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయం ప్రకారం, ఒక వీరనారికి ఇచ్చే గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు వందనం సమర్పించారు. పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించడం ఈ ఉత్సవంలోని ప్రత్యేకతగా నిలిచింది.
సంప్రదాయం, ఆధ్యాత్మిక కలయిక
సమ్మక్క రాకతో స్వాగతిస్తూ భక్తులు ఎదురుకోళ్లతో డోలు వాయిద్యాలతో కోలాహలం చేశారు. ఈ రాక కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరనారికి సమర్పించే నివాళి. ఇది వరకే గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో సమ్మక్క కలవడంతో దైవ కుటుంబం సంపూర్ణమైంది. గద్దెలపై నలుగురు దేవతలను కొలువుదీరడాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు.
మొక్కుల కోలాహలం
సమ్మక్క గద్దె పైకి చేరిన వెంటనే భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం ప్రారంభించారు. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని(బంగారం) అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. వన దేవతల దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించడం గమనార్హం.
ఈ నెల 31 వరక మహా జాతర
సమ్మక్క ఆగమనంతో జాతరలో ప్రధాన ఘట్టం పూర్తయినప్పటికీ, భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మహా జాతర ఈ నెల 31 వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. శనివారం వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేసే వరకు మేడారం ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర బిందువుగా నిలవనుంది.
