Crime News: గుట్టు చప్పుడు కాకుండా చంపేస్తారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మూటలో కట్టి కాల్వ సమీపంలోనో, లేదా ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలోనో పడేస్తారు. బండలు కట్టి చెరువులో పడేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మృతదేహాన్ని సంచిలో మూట కట్టి రైల్వే ట్రాకుల వెంట లేదా ట్రాకులపై పడేస్తారు. అలా మృతదేహాలను వదిలించుకుని తాము మాత్రం ఆ కేసు నుండి బయట పడగలమని భావిస్తారు హంతకులు. కొందరు అయితే చంపేని ఆ శవాన్ని మూట కట్టి చెత్త కుండీల వెంట పడేస్తారు. వాటిని వీధి కుక్కలు పీక్కుతింటుంటే చూసి స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన ఉదంతాలు కోకొల్లలు. 


వీటితో పాటు రసాయన పదార్థాలను, జంతు కళేబరాలను మూట కట్టి పడేస్తుంటారు చాలా మంది. జంతు కళేబరాలను తీవ్రమైన దుర్వాసృన వస్తుంది. రసాయన పదార్థాలతో పేలుడు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా సంచి మూట కనిపిస్తే స్థానికులు భయానికి, ఆందోళనకు గురి అవుతున్నారు. వాటిని ముట్టుకోవాలా వద్దా అనే సందేహం నెలకొంటోంది. రోడ్డుపై ప్లాస్టిక్ సామాన్లు, మందు సీసాలు, పేపర్లు ఏరుకుని బతికే వాళ్లు సైతం.. అలాంటి మూటల పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ అందులో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నా.. లేదా మృతదేహాలు ఉన్నా ఆ కేసు కాస్త వారికి చుట్టుకుంటుందని అన్న భయం వారిలో ఉంటుంది. 


సంచి చూసి ఆందోళన


తాజాగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంట గ్రామ శివారు పాకాల వాగు సమీపంలో ఓ సంచి మూట స్థానికులకు భయాందోళనకు గురి చేసింది. మృతదేహం లాంటి ఆకారంలో ఉన్న ఆ మూట చూసి స్థానిక గ్రామ ప్రజలు, అలాగే చుట్టు పక్కల పొలాలకు వెళ్లే రైతులు భయానికి గురయ్యారు. ఎవరిదైనా శవం అందులో ఉందా అనే అనుమానం వారిని గజగజలాడించింది. ఒకవేళ శవం ఉంటే అది ఎవరిది, ఎలా చంపారు, కుట్రతో చంపారా, లేదా నరి బలి ఇచ్చారా, అదీ కాకపోతే అనాథ శవాన్ని అలా మూట పట్టి పడేశారా అన్న భయం అక్కడి స్థానికుల్లో నెలకొంది. 


సంచిలో ఏముందంటే? 


వరిచేనును చూడటానికి వెళ్లినా రైతులకు ఒక పెద్ద తెల్ల బస్తా మూట వారిని భయపెట్టింది. ఆ మూట చుట్టూ బాగా ఈగలు చేరి ఘోరమైన దుర్వాసన వస్తుండటం వారిని మరింతగా కలవర పెట్టింది. ఇది చూసిన స్థానిక రైతులు, సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ భయపడి పోలీసులకు సమాచారం అందించారు. ఎంత సేపటికీ పోలీసులు రాకపోవడంతో 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. స్థానిక గ్రామస్థులు, రైతుల నుండి అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూటను పరిశీలించారు. మూటను కోడవలి తో కోయగా అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. అందులో మృతదేహాం, పేలుడు పదార్థాలు ఉంటాయనుకున్న స్థానికులు, రైతులు అందులో ఉన్నది చూసి ఆశ్చర్యపోయారు. అందులో బాయిలర్ కోళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందరు ఒక్కసారి చూసి నవ్వుకుని వెళ్లిపొయారు.