టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన సమర్థవంత నాయకుడు అని, కేటీఆర్ వల్లే రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు వచ్చాయని, పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుట్టు శిక్షణ కేంద్రాలతో మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. దీనిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.


ఈ నెల 8న తొర్రూరు పట్టణంలో నిర్వహించే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. డీఆర్డీవో సంపత్‌రావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌, ఎంపీడీవో కిషన్‌నాయక్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


కేటీఆర్ పర్యటన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వత గిరి మండలం, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 


మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ హెలి ప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్ లను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను అధికారులతో మంత్రి చర్చించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ సూచించారు.


పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 


మహిళలతో భారీ బహిరంగ సభ
పలు కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం 20 వేల మంది మహిళలతో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభలో కేటీఆర్ కొన్ని కీలక విషయాలపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. అదే సందర్భంగా డ్వాక్రా మహిళలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మంత్రి ఎర్రబెల్లి చర్చించారు. కేటీర్ పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు.