Pension recovery notice to Old Woman in Telagana | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని ప్రధాన హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ పేరిట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరుతుండటంతో ప్రజలకు హామీల అమలు, సంక్షేమ పథకాలు ఇవ్వడం పక్కనపెట్టి.. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడంపైనే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.  

Continues below advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ సెటైర్స్ పేల్చారు. తాము వస్తే కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఇదివరకే ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కి తీసుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏవో టెక్నికల్ రీజన్స్ చెబుతూ వేలాది మంది ఆసరా పెన్షన్ (Aasara Pension) లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపాలని నోటీసులు ఇస్తోందన్నారు.  

‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 80 ఏళ్ల ముసలమ్మ దాసరి మల్లమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా రూ.72 వేలు వెనక్కు కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఒంటరి మహిళ, పక్షవాతంతో బాధపడుతూ ఉన్న ఇలాంటి వృద్ధుల నుంచి గతంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నించడం అమానవీయ వైఖరికి నిదర్శనం. కనుక వెంటనే పేదల మీద ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడతారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Continues below advertisement