Kazipet Railway Over Bridge works not yet completed- హనుమకొండ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి, ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనులు ఇంకా నత్త నడకన కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు
ప్రజల రాకపోకలు దృష్ట్యా 1972 లో హైదరాబాద్, హనుమకొండ రోడ్డు మార్గంలో కాజీపేట రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పెరిగిన రద్దీకి ఇప్పుడు రాకపోకలు సాగిస్తున్న బ్రిడ్జి సరిపోక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2017 సంవత్సరంలో రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఏడు సంవత్సరాలు గడిచినా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
1972లో బ్రిడ్జి నిర్మాణం..
ట్రై సిటీస్‌గా పేరున్న వరంగల్ నగరంలో కాజీపేట ఒకటి. హైదరాబాద్‌కు వెళ్లాలంటే ప్రధాన రోడ్డు మార్గమైన కాజీపేట మీదుగా వెళ్లాలి. అయితే హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గంలో కాజీపేట రైల్వే లైన్ ఉండడంతో 1972లో ప్రజల అవసరాలు, వాహనదారుల రాకపోకల దృష్ట్యా రైల్వే లైన్ పై ఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే అప్పటి రద్దీకి అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సిటీ విస్తరించటం హైదరాబాద్ కు రాకపోకలు పెరగడంతో అప్పటి బ్రిడ్జి ఇరుకుగా మారడంతో, తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చిన్న ప్రమాదం జరిగినా, భారీ వాహనాలు సాంకేతిక లోపంతో బ్రిడ్జిపై నిలిచిన గంటల తరబడి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అంతే కాకుండా పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం, భారీ వాహనాలు వెళ్లినప్పుడు బ్రిడ్జి ధ్వసం అవుతుండడంతో ప్రమాదాన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మాణానికి 78 కోట్ల నిధులు మంజూరు చేసింది.
2017 సంవత్సరంలో ప్రారంభమైనా, ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రైల్వే లైన్ కు ఇరువైపులా 80 శాతం పనులు పూర్తయిన రైల్వే లైన్ పై చేపట్టాల్సిన పనులు నిలిచిపోయాయి. అయితే రైల్వే లైన్ పై బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు వాహనదారులు. రైల్వే లైన్ పై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలంటే రైల్వే జీఎం నుంచి అనుమతులు రావడం, రైల్వే నిబంధనల ప్రకారం వారి అధికారుల సమక్షంలో పనులు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారుల నుండి అనుమతులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
చొరవ చూపకపోవడంతో పూర్తికాని బ్రిడ్జి
రైల్వే లైన్‌పై నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపెట్టకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని విమర్శలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి దాదాపు 10 ఏళ్లు అధికారంలో కొనాసగింది. గత ప్రభుత్వంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలైనా, దాదాపు ఏడేళ్లు పూర్తయినా పనులు పూర్తి కాదేలు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బ్రిడ్జి పనులు ఇప్పటికైనా పూర్తి అవుతాయా.. లేక పాత లెక్కలు పరిశీలించడంతో మరింత ఆలస్యం జరిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు చొరవ చూపి రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయాలని వాహనదారులతో పాటు నగర ప్రజలు కోరుకుంటున్నారు.
నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మొదట్నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ల్యాండ్ సేకరించడంతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అప్పటి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.