IAS Bhavesh Mishra: భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District) కలెక్టర్ వివాదంలో చిక్కుకున్నారు. అటెండర్‌తో బూట్లు మోయించారని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో కలెక్టర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా అత్యున్నత అధికారి అయి ఉంది జిల్లాలో ఉద్యోగులకు ఏం మెస్సేజ్ ఇస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి.


అసలేం జరిగిందంటే..
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్థానికంగా జరిగిన క్రిస్మస్ 2023 వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరై మాట్లాడారు. అంతకుముందు కాళ్లకు షూస్ తోనే చర్చికి వెళ్లారు. ప్రార్థనా మందిరంలోకి వెళ్లే సమయంలో షూస్ బయట విడిచి వెళ్లారు కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఆయన బూట్లను అటెండర్ దఫేదార్ చేతికి ఇచ్చి వెళ్లగా, అటెండర్ బూట్లు మోస్తూ కనిపించాడు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చాక కలెక్టర్ కు బూట్లు ఇస్తూ అటెండర్ కనిపించాడు. ఆ సమయంలో కొందరు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


జిల్లా అత్యున్నత అధికారి, ఐఏఎస్ అయి ఉండి కింది ఉద్యోగులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు వారి పనులు వారితో చేయించాలి, కానీ ఆఖరికి కలెక్టర్ తన షూస్ ను అటెండర్ దఫేదార్ తో మోపించడం దారుణమని స్పందిస్తున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు సరికాదని, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే పని కాదంటున్నారు. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా. గత అక్టోబర్ నెలలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో  ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్టు అధికారిగా సేవలు అందించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్‌గా సైతం భవేశ్ మిశ్రా విధులు నిర్వర్తించారు.
Also Read: 'జోడెద్దుల్లా పని చేయాలి, అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు' - ఆ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్