Jangaon district News: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్‌కు చెందిన ఓ బీఆర్‌ఎస్‌ నేత తనను వేధిస్తున్నాడని అదే పార్టీకి చెందిన సర్పంచ్‌ మీడియా ముందుకు వచ్చారు. కన్నీరు పెట్టుకున్నారు. మాట వినలేదని గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులు ఆపేశారని వాపోయారామె. 


బి.ఆర్.ఎస్ నేత ఒకరు తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కూర్సపల్లి నవ్య ఆరోపించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ నేత కోరిక తీర్చాలంటూ మండలంలోని ఓ మహిళ నేతపై కూడా కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు తన వంతు వచ్చిందన్నారు. 


సదరు నేత అనుచరులు చెప్పిన మాట తాను వినలేదని గ్రామ అభివృద్ధి నిధులు కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని నవ్య వాపోయారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన చెందారు. వారికి అక్క చెల్లెలు లేరా?అంటూ ప్రశ్నించారు నవ్య.


ఆస్తులు బంగారం అమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్నామని, నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఫైర్‌ అయ్యారు నవ్య. ధర్మసాగర్ వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనమని రెండు మూడు వర్గాలు ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతుందోని విమర్శించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారంటు ఏడ్చేశారు.