Janagama MLA Muthireddy Yadagiri Reddy : జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడ కొన్ని కొండెంగలు, చీడపురుగులు ఉన్నాయని.. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని సీఎం చెప్పారని అన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా ముత్తిరెడ్డి పనితీరు బాగుందంటూ ప్రశంసించారని, బాగా పని చేయాలని దీవించారని అన్నారు. 
ఫామ్ హౌస్ లో కూర్చుంటే రాజకీయాలు చేయలేం!
ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయం చేస్తెనో, తెల్ల బట్టలు వేసి మందు తాగితేనో ప్రజాక్షేత్రంలో నడవదు అన్నారు. ప్రజల మధ్యలో తిరిగి, వారి సమస్యలు తెలుసుకుని ప్రజల పక్షాన నిల్చున్న వాళ్లనే ప్రజలు ఆదరిస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని భూస్థాపితం చేసి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిలబెట్టి 34 వేల మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిఫ్ట్ ఇచ్చామన్నారు. నీచమైన రాజకీయాలు చేసిన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సపోర్ట్ చేయరని జాగ్రత్తగా ఉండాలన్నారు. 


ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రజా క్షేత్రంలోనే ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రిపోర్ట్ ఉందన్నారు. మంత్రులందరి ముందే యాదన్న నీకు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉందని, మరింత మెరుగుపరచుకోమని సీఎం అన్నారు. ఎక్కడో ఉన్న నియోజకవర్గాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నాం అన్నారు. ముందుకుపో అని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారని ముత్తిరెడ్డి చెప్పారు. పార్టీలో అక్కడక్కడ మోపైన కోతులు, కొండెంగల మెడలను వంచేస్తాయని సీఎం కేసీఆర్ అన్నారని, ఎమ్మెల్యేను కాదని ఎవరు ఏమీ చేయడానికి లేదని సీఎం చెప్పారని గుర్తుచేశారు.


ఇటీవల ఎమ్మెల్యేపై కూతురు ఫిర్యాదు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూమిపై తీవ్ర వివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ విపక్షాల ఆరోపించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ఇదే విషయమై తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. 


కావాలనే ప్రత్యర్థులు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు..!
తన కూతురు తనపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థులు కావాలనే కుట్ర పన్ని తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చేర్యాలలోని సర్వే నంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ చేసిందని.. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హైదరాబాద్  ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు పేరు మీద 125 నుండి 150 గజాల స్థలం ఉందని.. అందులోనూ ఎలాంటి ఫోర్జరీ లేదని చెప్పుకొచ్చారు. కిరాయి నామా దస్తావేజు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.