జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆమె కుమార్తెనే గుదిబండగా మారిన సంగతి తెలిసిందే. తన తండ్రే అవినీతి పరుడని ఆమె బాహాటంగానే ప్రచారం చేస్తూ ఉంది. తాజాగా మరోసారి ఆయనకు కుమార్తె షాకిచ్చింది. తన తండ్రి మంచివాడు కాదని, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కావడం లేదని కుమార్తె తుల్జా భవాని రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


తన పేరు మీద చేర్యాల మున్సిపాలిటీలోని కొంత భూమిని తన తండ్రి రిజిస్టర్ చేయించడంతో దాన్ని తిరిగి ఇచ్చేసినట్లుగా ఆమె గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సినది.. ఓడించాల్సినది ప్రజలేనని తుల్జా భవాని రెడ్డి అన్నారు. చేర్యాల మున్సిపాలిటీలో కబ్జాకు గురైన ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తుల్జా భవాని రెడ్డి ప్రశ్నించారు. కబ్జా చేసిన ఆయన్ను వదిలేసి తిరిగి తనపైనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామకు వెళ్లి అడిగితే యాదగిరి రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ చెబుతారని అన్నారు. ఇప్పుడిప్పుడు కొంతమంది తన తండ్రి బాధితులు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు.


ఇలాంటి అవినీతి పరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని అన్నారు. సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్‌ పేరు చెప్పుకొని గత ఎన్నికల్లో మళ్లీ గెలిచారని విమర్శించారు. తాను తన తండ్రి నుంచి ఒక్క రూపాయి కూడా ఆస్తి తీసుకోలేదని చెప్పారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తన వెనక ఏ రాజకీయ పార్టీ ఉండి ఇదంతా చేయించడం లేదని చెప్పారు. కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేదని వెల్లడించారు.