Draupadi Murmu: భద్రాచలం పర్యటన ముగించుకున్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు రామప్పకు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ముర్ము హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అవుతారు. 2.30 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి 2.40 గంటలకు ఆలయం వద్దకు వస్తారు. రుద్రేశ్వరుడి దర్శనం, ఆశీర్వచనం, ఆలయ విశిష్టతను తెలుసుకున్న అనంతరం 20 నిమిషాల తర్వాత సరిగా 3 గంటలకు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లా చరిత్రలో రాష్ట్రపతి రాక ఇదే ప్రథమం


రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి తెలంగాణకు రావడం ఇదే మొదటి సారి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు రామప్పకు రానున్న విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఆమె వీక్షించనున్నారు. 1982లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు అప్పటి ఉప రాష్ట్రపతి హిదాయతుల్లా ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంతకన్నా మించిన హోదాలో ఒక రాజ్యాధిపతి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు రావడం ఇదే మొదటి సారి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హయాంలో ఆయన చొరవతో వరంగల్‌లో పోతన పంచశతి ఉత్సవాలు అయిదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అప్పట్లో అదే మొదటిసారి.


ప్రసాద్ స్కీమ్ పైలెట్ ప్రాజెక్టు


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈనెల 28న రాష్ట్రపతి రామప్ప రానుండగా.. ములుగు గిరిజన జిల్లా అయినందున ఆదివాసీ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. రామప్ప గార్డెన్ ను అందంగా తీర్చిదిద్దినట్లు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రామప్ప ప్రాంగణం అంతా శానిటైజ చేశామన్నారు. కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ కూడా చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలన్నింటిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.


రామప్ప పరిసరాల్లో నిషేధాజ్ఞలు..


రామప్ప పరిసర ప్రాంతాల్లో నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఆలయం ప్రతీ భాగాన్ని పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటనలో భద్రత ఏర్పాట్లకు ప్రజలు.. పోలీసులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. రామప్పలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయనున్నామని తెలిపారు. మూడు ఎలిప్యాడ్ లు ల్యాండ్ అయ్యే విధంగా స్థలం ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ స్థలాలను కూడా పరిశీలించి నిన్న తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓకే రమా దేవి, డీపీఓకే వెంకయ్య, పంచాయతి రాజ్ ఈఈ రవీందర్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్, డీఈ ఇరిగేషన్ వెంకట కృష్ణారావుకు, పాలంపేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.