హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ గత ఏడాది చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పరువు నష్టం దావా, కోర్టుకు వరకు విషయం వెళ్లింది. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కింగ్ నాగార్జునకు, ఆయన కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, నాగార్జున కుటుంబాన్ని తక్కువ చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు.
తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న కొండా సురేఖ నాగార్జునను, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనేది తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. ఆయన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని తనకు ఏమాత్రం లేదన్నారు. గతంలో తాను అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించి ఉంటే, అందుకు తాను చింతిస్తున్నానంటూ విచారణం వ్యక్తం చేశారు. తాను నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇంతకీ కొండా సురేఖ కామెంట్స్ ఏంటీ..గత ఏడాది అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసుకుని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఎంతో మంది టాలీవుడ్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. కొందరు హీరోయిన్లకు డ్రగ్స్ సైతం కేటీఆర్ అలవాటు చేశారని వ్యాఖ్యానించారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమన్నారు. ఫోన్ ట్యాపింగ్స్ చేసి, వారి సీక్రెట్స్, వ్యక్తిగత విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. అందువల్లే సినీ జంట విడాకులు తీసుకుందని కొండా సురేఖ సంచలనానికి తెరలేపారు. కొందరు హీరోయిన్లు చిన్న వయసులో పెళ్లి చేసుకోగా, కొందరు హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్లడానికి కూడా కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని రేపాయి.
మంత్రి కొండా సురేఖపై నాగార్జున దావా..రాజకీయంగా ఆరోపణలు చేసే సమయంలో సాటి మహిళ అని చూడకుండా సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని సినీ ఇండస్ట్రీ కొండా సురేఖను తప్పుపట్టింది. చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు నాగార్జున కుటుంబంపై, సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అయితే కొండా సురేఖ సమంతకు మాత్రంసారీ చెప్పారు. తన ఉద్దేశం ఆమెను బాధపెట్టడం కాదన్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టం అందరికీ సమానమేనన్నారు. రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం సరికాదని కొండా సురేఖకు హితవు పలికారు. కేసు విచారణలో భాగంగా నాగార్జున, అమల, నాగ చైతన్య విచారణకు హజరై తమ వాదన వినిపించారు.
కేటీఆర్ పరువునష్టం దావా..తనపై చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. సంబంధం లేని విషయాల్లో కొండా సురేఖ తనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే, ఏ ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ సైతం విచారణకు హాజరయ్యారు. మహిళను కించపరిచారని, తన గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు.