Padi Kaushik Reddy : గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఉత్కంఠ మధ్య బెయిల్‌ మంజూరు అయిన తర్వాత కౌశిక్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డిపై ఎన్ని కేసులు పెడితే అంతా రెట్టింపు ఉత్సాహంతో ఏకే 47లా తయారవుతానని అన్నారు. 

రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల వద్ద 20 శాతం కమిషన్ తీసుకోవడం దోపిడీ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి సీతక్క ఇసుక కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ తీసుకోవడం దోపిడీ అని విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేదల భూములు లాక్కోవడం, అక్రమంగా క్వారీ నడపడం దోపిడీ అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ వద్ద డబ్బులు తీసుకొని పోస్టింగ్‌లు ఇవ్వడం దోపిడీ అన్నారు.  రేపటి నుంచి ఒక్కొక్కరి బట్టలిప్పుతానని పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సాక్షాలతో కాంగ్రెస్ పార్టీ దోపిడీని హైదారాబాద్‌లో బయట పెడతానని హెచ్చరించారు.

హన్మకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వంగపల్లి గ్రామంలో గ్రైనేట్ క్వారీ ఉంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ బెరదింపులకు పాల్పడుతూ, డబ్బు డిమాండ్ చేస్తున్నాడని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్​ నెలలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్‌లు అరెస్ట్ చేసి హన్మకొండ తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుబేదారి పోలీస్ స్టేషన్ కేసు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై మొదట నమోదు చేసిన 308(4)కు బదులు 308(5) సెక్షన్ కు మార్చారు. 308(5) నాన్ బెలబుల్ కావడంతో మధ్యాహ్నం రెండు గంటల తరువాత కౌశిక్ రెడ్డిని వరంగల్ ఎంజీఎంలో  తరలించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు తరలించారు. 

మొదట వరంగల్ మూడో అదనపు మునిసిఫ్ జడ్జి ముందు హాజరుపర్చాలనుకున్నారు. అయితే జడ్జి అందుబాటులో లేకపోవడంతో కాజీపేట రైల్వే కోర్టుకు తరలించారు. బెదిరింపు కేసుపై సుమారు 4గంటల పాటు వాదనలు జరిగిన తర్వాత కాజీపేట రైల్వే కోడ్ జడ్జి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. దీంతో బీ అర్ ఎస్ శ్రేణులు ఆనందం మునిగాయి.

కౌశిక్ రెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఉన్నంతసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి సైతం పోలీస్ స్టేషన్‌లో కలవడం జరిగింది. కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటికి మరోసారి టిఆర్ఎస్ నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.